కుక్కలు అంటే కొంత మందికి ఇష్టం ఉంటుంది. మరి కొంత మందికి భయం ఉంటుంది. మనం సాధారణంగా మన వీధుల్లో కుక్కలను చూస్తూనే ఉంటాం.
కొంత మంది ఇళ్లల్లో పెంచుకునే చిన్న చిన్న కుక్కలను కూడా మనం చూస్తూనే ఉంటాం. ఈ విషయం మనకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కుక్క మాత్రం మామూలు కుక్క కాదు.
ఈ కుక్కను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. దీన్ని చూస్తే ఇది కుక్కనా లేక అడవి నుండి వచ్చిన సింహమా అనే సందేహం మీకు వస్తుంది.
ఈ కుక్క పేరు టిబెటన్ మాస్టిఫ్ (Tibetan Mastiff). దీని అసలు సంగతి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Tibetan Mastiff సింహాన్ని సైతం భయపెట్టే కుక్క

ఈ కుక్క మన దగ్గర ఉండే కుక్క లెక్క కాదు. ఈ కుక్కలు మన దగ్గర ఉండవు. ఇది హిమాలయ అవతల ఉండే టిబెట్ లో ఉంటాయి. మంచు కొండల్లో అక్కడ చలి ఎక్కువగా ఉన్నా ఈ కుక్కలు తట్టుకుంటాయి.
పూర్వకాలంలో అక్కడ మేకలను, గొర్రెలను, ఇండ్లను, మొనాస్టరీలను అంటే బౌద్ధ ఆశ్రమాలను కాపలా కాయడానికి వీటిని పెంచారు.
సింహాలు, పులులు వచ్చినా ఏమాత్రం భయపడకుండా వాటితో పోట్లాడే ధైర్యం ఈ కుక్కలకు ఉన్నది.
ఈ కుక్క రూపం ఎలా ఉంటుందంటే, దీని సైజు మామూలు కుక్కల లాగా ఉండదు. దీని సైజు చాలా పెద్దగా ఉంటుంది. ఈ కుక్క నిలబడితే మనిషి అంత ఎత్తు కనబడుతుంది.
దీనికి ఆహారం బాగా పెడితే చాలా బరువుగా అవుతుంది. దాదాపు 60 నుండి 70 కిలోల దాకా బరువు పెరుగుతుంది. అంటే ఒక మనిషి బరువు అన్నమాట.
దీని మెయింటెనెన్స్ కోసం ఆస్తులు అమ్ముకోవాలి
ఈ కుక్క యొక్క జూలు దీని ప్రత్యేకత. దీని జూలు అచ్చం మగ సింహం మాదిరి ఉంటుంది. ఆ జుట్టు వల్ల ఆ కుక్క చూడ్డానికి అంత గంభీరంగా కనబడుతుంది.
ఇది చూడటానికి చాలా భయంకరంగా ఉన్నా దీన్ని పెంచుకునే వారికి మాత్రం ఇది ప్రాణం లెక్క ఉంటుంది. ఇది యజమాని అంటే ప్రాణం ఇస్తుంది. వాళ్ళ ఇంటికి కాపలా ఉండటంలో దీనికి సాటి ఏదీ లేదు.
ఈ కుక్క చాలా మొండిఘటం. ఇది దాని సొంత తెలివి ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఇది కూర్చోమంటే కూర్చోదు. లేవమంటే లేవదు. అంటే చెప్పింది వెంటనే చేయదు అన్నమాట.
దాని మూడ్ ఎలా ఉంటే అలా నడుచుకుంటుంది. ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, అనుమానం ఉన్న వాళ్ళు వస్తే అసలు ఊరుకోదు. చాలా గట్టిగా మొరుగుతుంది.
ఈ కుక్క తినే తిండి మామూలుగా ఉండదు. ఇది రోజుకు కిలోల మాంసం తింటుంది. మంచి క్వాలిటీ ఫుడ్ దీనికి అందించాలి. ఈ కుక్క కు మెయింటెనెన్స్ ఖర్చు తడిసి మోపెడం అవుతుంది.
దీన్ని పెంచుకోవాలంటే 24 గంటలు ఏసీ ఉండాలి. లేకుంటే ఈ కుక్క హీట్ స్ట్రోక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది. ఇది అపార్ట్మెంట్లో పెంచుకునే కుక్క కాదు.
కుక్క కాదు ఇది ఒక స్టేటస్ సింబల్
ఈ కుక్కను మన తెలుగు రాష్ట్రాల్లో పెంచుకోవడానికి వీలు ఉండదు. ఇక్కడి ఎండలకు ఈ కుక్క సెట్ కాదు. ఈ కుక్క ఒంటి నిండా జుట్టు బాగా ఉంటుంది కాబట్టి ఇది ఎండను తట్టుకోలేదు.
ఈ కుక్క రేటు వింటే మీకు కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఒరిజినల్ బ్రీడ్ టిబెటన్ మాస్టిఫ్ కొనాలంటే, లక్షల్లో ఉంటుంది.
కొన్ని కొన్ని సార్లు కోట్లు పెట్టి కొన్నవారు కూడా ఉన్నారు. ఒకసారి చైనాలో దీన్ని దాదాపుగా 10 కోట్లు పెట్టి కొన్నారు. ఇది కేవలం కుక్క మాత్రమే కాదు. ఒక స్టేటస్ సింబల్ అన్నమాట.
టిబెటన్ మాస్టిఫ్ అనేది మామూలు కుక్క కాదు. అది రాయల్ బ్రీడ్ కుక్క. ఇది మన వాతావరణానికి, ఖర్చులకు సెట్ కాదు. కానీ దీన్ని దూరం నుంచి చూస్తే మాత్రం అబ్బ భలే ఉంది అనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: [సముద్రంలో ఒంటరి తిమింగలం, నేల మీద ఒంటరి తాబేలు]
Akhal Teke కోట్లు పోసినా దొరకని అందమైన గుర్రం

బంగారం అంటే దాదాపు అందరికీ ఇష్టమే ఉంటుంది. బంగారాన్ని మనం షాపుల్లో కొనుక్కుంటాం. దాన్ని మనకు నచ్చిన విధంగా ఉపయోగించుకుంటాం.
కానీ బంగారమే గుర్రం లాగా పుడితే ఎలా ఉంటుంది? చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు. ఇప్పుడు నేను చెప్పబోయే గుర్రం కూడా బంగారం లాగానే ఉంటుంది.
ఈ గుర్రం పేరు అఖల్ టేకే (Akhal-Teke) గుర్రం. దీనిని చూడగానే అబ్బా భలే ఉంది అని అంటాం. ఇది అచ్చం బంగారం పూత పూసినట్టు ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యంత అందమైన గుర్రంగా దీనికి పేరు ఉన్నది. ఇది తుర్కమెనిస్తాన్ (Turkmenistan) అనే దేశంలో పుట్టింది. జనాలకు అక్కడ ఈ గుర్రం అంటే ప్రాణం.
దేశం కరెన్సీ నోట్ల మీద, స్టాంపుల మీద కూడా ఈ గుర్రం బొమ్మనే ఉంటుంది. దాదాపుగా 3000 సంవత్సరాల నుండి ఈ జాతి ఉన్నది.
ఎడారిలో పెరిగిన మెరుపు తీగ
ఈ గుర్రాన్ని గోల్డెన్ హార్స్ అని అంటారు. దీని చర్మం మీద ఉండే వెంట్రుకలు ఒక ప్రత్యేకమైన తీరులో ఉంటాయి.
ఎండ ఈ గుర్రం మీద పడిందంటే లైట్ రిఫ్లెక్ట్ అయ్యి నిజంగానే బంగారం మెరిసినట్టుగా జిగేల్ మని మెరుస్తుందట. దీని బాడీ మన దగ్గర ఉండే గుర్రాల లెక్క కండలు తిరిగి ఉండదు.
ఇది గ్రేహౌండ్ కుక్క లెక్క సన్నగా, నాజుగ్గా, పొడవుగా ఉంటుంది. ఈ గుర్రం చర్మం చాలా పల్చగా ఉంటుంది. దీని నరాలు కూడా పైకి కనబడతాయి.
దీని స్టామినా మామూలుగా ఉండదు. ఇది చూడ్డానికి స్లిమ్ గా, డెలికేట్ గా కనిపిస్తుంది. కానీ దీని లోపల బలం మాత్రం అద్భుతం.
ఇది తిండి, నీళ్లు సరిగా దొరకని ఎడారిలో కూడా మైళ్ళ కొద్దీ దూరం పరిగెడుతుంది. ఈ గుర్రం ఎడారి, ఇసుక కఠినమైన వాతావరణంలో పుట్టి పెరిగింది. అందువల్ల దీనికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది.
డబ్బున్న వాళ్ళకు కూడా దొరకని అద్భుతం
ఈ గుర్రం అందరితో కలవదు. ఇది ఒక్క యజమానిని మాత్రమే నమ్ముతుంది. వారు చెప్తేనే వింటుంది. కానీ వేరే వాళ్ళు ముట్టుకుంటే దీనికి అసలు నచ్చదు.
దీనికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఏం చెబుతున్నా తొందరగా అర్థం చేసుకుంటుంది. ఇది ప్రపంచంలోనే అరుదైన గుర్రం.
ప్రపంచం మొత్తం మీద ప్రస్తుతానికి కొన్ని వేల గుర్రాలు మాత్రమే ఉన్నాయి.
దీన్ని ఎవరైనా కొనాలి అంటే మామూలు మనుషుల వల్ల కాదు. దీని రేటు కోట్లల్లో ఉంటుంది. దీన్ని అసలు తుర్కమెనిస్తాన్ వాళ్లు ఎవరికి అమ్మరు.
వాళ్లు దీన్ని గౌరవంగా, వేరే దేశం రాజులకు, ప్రెసిడెంట్లకు గిఫ్ట్ గా ఇస్తుంటారు.
మీకేమనిపిస్తుంది
సింహం లాంటి ఈ కుక్క, బంగారం లాంటి ఈ గుర్రం, మీ దగ్గర కోట్లు ఉంటే, ఈ రెండింటిలో ఏది కొంటారు? మీ ఆన్సర్ కింద కామెంట్ చేయండి.
