ప్రకృతిలో ఎన్నో రకాల వింతలు ఉన్నాయి. వాటిలో ఈ కొన్ని మొక్కలు చాలా స్పెషల్ గా ఉంటాయి. ఈ మొక్కల లక్షణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
ఒక మొక్క చూడడానికి చాలా అమాయకంగా ఉంటుంది. కానీ, దగ్గరికి ఏమైనా చిన్న పురుగులు వస్తే టపీమని మింగేస్తుంది. అంటే మాంసాహారం తింటుంది.
మరొక మొక్క ఏమో అచ్చం మనిషి మాదిరి స్పందన చేస్తుంది. ఎవరైనా మొక్కను ముట్టుకోగానే ముడుచుకుంటుంది.
ఇంకొక మొక్కకు బ్రతకడానికి మట్టే అవసరం లేదు. గాలిలో వేలాడుతూ చాలా దర్జాగా బతుకుతుంది. మరి ఈ మూడు మొక్కల వెనక ఉన్న అసలు సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Pitcher Plant మాంసం తినే రాక్షస మొక్క

మామూలుగా మొక్కలు నేల తోటి మరియు సూర్యకాంతి తో ఆహారాన్ని తీసుకుంటాయి. కానీ మాంసాన్ని ఆహారంగా తీసుకునే మొక్కను మీరు ఎప్పుడైనా చూశారా?
అవును ఇది నిజం పిక్చర్ ప్లాంట్ (Pitcher Plant) అనే ఒక మొక్క మాంసాన్ని ఆహారంగా తీసుకుంటుంది. దీన్ని తెలుగులో కీటకాహార మొక్క అని కూడా పిలుస్తారు.
పిక్చర్ ప్లాంట్ నత్రజని తక్కువగా ఉండే చిత్తడి నేలల్లో పెరుగుతుంది. ఇవి ఆమ్ల గుణాలున్న నేలలో కూడా పెరుగుతాయి.
ఈ మొక్కలు వాటికి కావాల్సిన నత్రజని కోసం కీటకాలను మరియు కొన్నిసార్లు చిన్నచిన్న కప్పలను కూడా ఆహారంగా తింటాయి.
ఎలుకలను కూడా వదలని ఆకలి
కప్పలను ఆహారంగా తినడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నమ్మలేని నిజం. ఇంకొక విషయం ఏమిటంటే కొన్ని పెద్ద సైజు మొక్కలు చిన్న ఎలుకలను మరియు పక్షులను తింటాయి.
మరి ఈ మొక్కలు వీటిని ఆహారంగా తీసుకుంటే ఎలా జీర్ణం అవుతుంది అని అనుకుంటున్నారా? ఇవి జీర్ణం చేసుకోగలవు. ఈ మొక్కల వల్ల మంచి ఉపయోగం ఉంది.
కీటకాలను నివారించడంలో చాలా ఉపయోగపడతాయి. ఇటువంటి మొక్కలను మనం ఇంటిలో పెంచుకోవచ్చా అని మీకు ఒక సందేహం రావచ్చు.
వీటిని శుభ్రంగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు. అయితే వీటికి పొరపాటున కూడా ఎరువులు వేయకూడదు. ఎందువల్ల అంటే, వీటికి కావలసిన ఆహారాన్ని కీటకాల ద్వారా తీసుకుంటాయి.
Touch-me-not Plant సిగ్గుపడే మొక్క వెనుక ఉన్న సైన్స్

చిన్నపిల్లలు దారిలో పోతున్నప్పుడు వాళ్లకు ఏదైనా ఒక మొక్క కనిపిస్తే దాన్ని ముట్టుకుని చూస్తారు. అప్పుడు అది ముడుచుకుంటుంది. అది అత్తిపత్తి చెట్టు.
దాన్నే సిగ్గుపడే మొక్క (Touch-me-not) అంటారు. కొంత మంది నిద్ర గన్నేరు అని ప్రేమగా పిలుచుకుంటారు. ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది.
కానీ ఎవరైనా టచ్ చేయగానే ముడుచుకుంటుంది. ఇది మొక్క సిగ్గుపడుతుందా లేక భయపడుతుందా అనే విషయం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
ఈ మొక్క అసలు ఎందుకు ముడుచుకుంటుందంటే దీనిని సైంటిఫిక్ భాషలో మిమోసా పూడికా (Mimosa Pudica) అంటారు. లాటిన్ భాషలో పూడిక అనగా సిగ్గుపడేది అని అర్థం.
సైన్స్ ప్రకారం చూస్తే దీనికి అసలు సిగ్గు కానీ భయం కానీ ఉండదు. మాయాజాలం అంతా దాని ఆకుల్లో ఉన్న నీటిలో ఉంటుంది.
ముట్టుకుంటే ఎందుకు ముడుచుకుంటుంది
ఈ మొక్క కాడల అడుగు భాగంలో నీళ్లతో కూడిన సంచులు ఉంటాయి. ఈ మొక్కను ఎవరైనా ముట్టుకోగానే దానికి కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక సిగ్నల్ వెళ్తుంది.
అంతే అప్పుడు కాడలలోని నీటిని కాండం వైపుకు లాక్కుంటుంది. ఆకులు నీళ్లు తగ్గిపోగానే టపీమని కిందికి వాలిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే గాలి తీసేసిన బెలూన్ లాగా ఉంటుంది.
ఆ తర్వాత మెల్ల మెల్లగా నీళ్లు ఆకులోకి రాగానే అప్పుడు దానికి బలం వస్తుంది. కానీ ఈ మొక్కకు మాత్రం ఇది బతుకు పోరాటం.
ఏదైనా పురుగు గాని, జంతువు గాని, దీని యొక్క ఆకులను తినడానికి వస్తే, ముట్టుకోగానే ఆకులు ముడుచుకుపోతాయి. అప్పుడు ఆ జంతువులు ఇది ఎండిపోయిన మొక్క అనుకోని తినకుండా వెళ్ళిపోతాయి.
ఈ చెట్టుకి ముళ్ళు కూడా ఉంటాయి. అందువల్ల దీనికి డబల్ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. పూర్వికులు అప్పట్లో చాలా రకాల జబ్బులకు ఈ మొక్కను ఉపయోగించేవారు.
ఇది కూడా చదవండి: [నడిచే చెట్టు, నాట్యం చేసే మొక్క]
Air Plants మట్టి లేకుండా గాలిలో బతికే మొక్కలు

మామూలుగా మొక్కలను పెంచాలంటే మట్టి ఉండాలి. కుండీ ఉండాలి వాటిని పెట్టి రోజు నీళ్లు పోస్తూ ఉండాలి. కానీ ఈ దునియాలో కొన్ని మొక్కలు మట్టితో అస్సలు పని లేకుండా పెరిగే మొక్కలు కూడా ఉన్నాయి.
వాటిని Air Plants అంటారు. సైన్స్ భాషలో వీటిని టిల్లాండ్సియా (Tillandsia) అంటారు. ఇవి గాలిలో ఊగుతూ, గాలిలోని తేమని పీల్చుకుంటూ బతుకుతాయి.
సాధారణంగా మొక్కల వేర్లు భూమిలో ఉండి వాటి బలం కోసం నీళ్లను పీల్చుకుంటాయి. కానీ ఈ మొక్కలు మాత్రం అట్లా కాదు. ఇవి వేటినైనా పట్టుకోవడం ద్వారా వీటికి బలం వస్తుంది.
వీటి ఆకుల పైన చిన్నచిన్న చుక్కల లాగా ఉంటాయి. వీటినే ట్రైకోమ్స్ అంటారు. ఇవి గాలిలోని తేమను మరియు వాన నీటిని పీల్చుకుంటాయి. వీటికి ఎండ అంటే చాలా ఇష్టం.
గాలిని శుభ్రం చేసే ప్లాస్టిక్ పువ్వులు
ఈ మొక్కల ప్రత్యేకత ఏమిటి అనగా వీటికి మట్టితో పనిలేదు. కుండీలు అవసరం లేదు. వీటిని ఏదైనా గాజు గ్లాసులో లేదా ఒక చెక్క ముక్కకు లేదా ఏదైనా తీగకి కట్టొచ్చు.
ఇవి పెరిగినాక మధ్యలో నుండి మంచి ఎర్రటి ఊదా రంగుతో మంచి పూలు వస్తాయి. ఇవి ప్లాస్టిక్ పూల లెక్క పెద్దగా మెరుస్తాయి. వీటిని ఇంటిలో పెట్టుకోవచ్చు.
ఇవి రాత్రిపూట గాలిని శుభ్రం చేస్తూ మంచి ఆక్సిజన్ ని అందిస్తాయి. వీటికి ప్రతిరోజు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కాకుండా, వారానికోసారి నీళ్లలో ముంచి తీస్తే సరిపోతుంది.
ఈ మొక్కలు మన ఇంటిలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నర్సరీలో కూడా దొరుకుతాయి వీటివల్ల మంచి ఆక్సిజన్ వస్తుంది. వీటిని పెంచడం పెద్ద కష్టం కాదు.
మీకేమనిపిస్తుంది
మాంసం తినే మొక్క, సిగ్గుపడే మొక్క, మట్టి లేకుండా బతికే మొక్క. ఈ మూడింటిలో మీకు ఏది బాగా నచ్చింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
