వీటిని చూస్తే కడుపుబ్బ నవ్వుతరు.. లేదంటే భయంతో వణికిపోతరు.. గంత గమ్మత్తుగుంటయ్ ఈ జీవులు
ఈ భూమి మీద చాలా రకాల జీవరాసులు ఉన్నాయి. వాటికంటూ ప్రత్యేకమైన జీవన విధానం ఉంటుంది. కొన్ని జీవరాసులు చూడటానికి చాలా గమ్మత్తుగా ఉంటాయి. మరికొన్ని చాలా భయంకరంగా ఉంటాయి.దయ్యం మాదిరి ఉంటాయి. ఎవరికీ ఏం కీడు చేయకపోయినా చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి. కొన్ని జీవరాసులు బద్ధకంగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం మూడు రకాల వింత జీవుల గురించి తెలుసుకుందాం.
1. లోకంలనే అత్యంత వికారమైన చేప.. బ్లబ్ ఫిష్ (blob fish) ముచ్చట్లు

బ్లబ్ ఫిష్ (blob fish) ఫిష్ చెప్పాలంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది మామూలు చేపలాగా అసలు ఉండనే ఉండదు. ఇది మామూలు చెరువులలో దొరికే చేప కాదు. ఆస్ట్రేలియా సముద్రం లోపల అట్టడుగున ఉంటుంది. మన భూమికి చాలా దూరంగా ఉంటుందన్నమాట. మన భూమి మీద కంటే అక్కడ గాలి పీడనం 120 రేట్లు చాలా ఎక్కువగా ఉంటుంది. అంత లోతులో ఏ జీవి అయినా బతకడం చాలా కష్టం అవుతుంది. కానీ ఇది మాత్రం చాలా దర్జాగా బతుకుతూ ఉంటుంది.
ఇది ఫోటో లో చూడడానికి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక ముసలోడి ముఖానికి ఏదైనా పిండి కలిపి అతికించినట్టు ఉంటుంది. దీని ముక్కు చాలా పెద్దగా ఉంటుంది. దీని రూపం చూస్తే ఎప్పుడు ఏడుస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఇది అలా ఉంటుంది కాబట్టి, దీనికి ప్రపంచంలోనే వికారకరమైన జంతువు అని పేరు ఉంది.
దీని అసలు కథ చెప్పాలంటే, ఇది సముద్రంలో అంత అడుగున ఉన్నా కానీ, ఇది సముద్రంలోపల ఉన్నట్టే అనిపించదు. సముద్రంలో నీటి ఒత్తిడి వల్ల ఇది మామూలు చేప మాదిరి కనిపిస్తుంది.చేపలు పట్టేవారు దాన్ని గాలమేసి బయటికి తీసినప్పుడు, గాలి పీడనం తట్టుకోలేక ఒళ్లంతా బాగా ఉబ్బి తొందరగా ముద్ద లెక్క అవుతుంది. దీనికి ఇతర చేపల లెక్క గట్టి ఎముకలు ఉండవు. కండరాలు కూడా ఉండవు. ఏదో ఉన్నామా అన్నట్టు ఉంటుంది.
నీళ్ల మీద తేలుతున్న జెల్లీ మాదిరి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇది చాలా బద్దకంగా ఉంటుంది. దీనికి వేటాడి ఆహారం సంపాదించుకోవడం చేతకాదు. దీనికి వేగంగా ఈదడం కూడా రాదు. దీనికి వేటాడడం చేతకానప్పుడు మరి ఆహారం ఎలా సంపాదించుకుంటుంది, అని మీకు సందేహం రావచ్చు. ఇది నోరు తెరుచుకుని ఉంటుంది. అప్పుడు దాని నోట్లోకి ఏదైనా పురుగులో లేక పీతలు వస్తే అప్పుడు దాన్ని మింగేస్తుంది. అంతేకానీ కష్టపడి వేటాడి ఆహారం సంపాదించుకోవడం దీనికి చేతనే కాదు.
సాధారణంగా చేపలు నీళ్లలో తేలడానికి మరియు గాలిలో ఎగరడానికి ఒక సంచి లాంటిది ఉంటుంది. కానీ వీటికి అలాంటి సంచి ఏమీ ఉండదు. వీటికి ఒళ్లంతా కొవ్వు ఉంటుంది. అందువల్ల ఈ చేపలు నీళ్లలో తేలుతాయి. ఇవి మనుషులకు ఏమి కీడు చేయవు కానీ మనుషులే వీటికి కీడు చేస్తారు. సముద్రం అట్టడుగున ఉండే పీతలను రొయ్యలను పట్టుకోవడానికి పెద్ద పెద్ద వలలు వేసినప్పుడు ఈ చేపలు ఆ గాలానికి చిక్కి ఊరికే చనిపోతుంటాయి. అలా చనిపోవడం వలన సముద్రంలో వీటి సంఖ్య చాలా తగ్గింది. ప్రతి జీవి చూడడానికి ఎలా ఉన్నా భగవంతుడు సృష్టించిన ప్రతి జీవికి ఒక విలువ ఉంది. ఈ చేప కూడా సముద్రం అట్టడుగునా ఉండి చిన్న చిన్న పురుగులను, మురికిని తిని శుభ్రం చేస్తుంది.
2. ఆక్సో లోట్ల్ ( Axolotl ) చావును కూడా జయించే మొనగాడు

ఆక్సో లోట్ల్ ( Axolotl ) – నీటి డ్రాగన్ దీన్ని చూడగానే ఇది చేపన లేక ఎలుకన అనే సందేహం మనకు వస్తుంది. ఇది చేప మాదిరే ఉంటుంది కానీ చాప కాదు. దీన్ని ఒక రకమైన నీళ్ల బల్లి అంటారు. ఇది మెక్సికో సరస్సుల్లో కనిపిస్తుంది.దీనికి తల పక్క భాగంలో పిలకల లాగా మూడు రెక్కలు ఉంటాయి. వీటిని వాటి ఊపిరితిత్తులు అంటారు. వీటితోనే ఇవి నీళ్లలో గాలిని పిలుస్తాయి. దీని దగ్గర ఒక మాయ శక్తి ఉంది. బల్లికి తోక తెగిపోతే మళ్లీ ఎలా వస్తుందో, మీకు తెలుసు కదా కానీ దీనికి తోక తెగిన, కాలు తెగిన ఆఖరికి గుండెకాయ తెగిపోయిన కూడా మళ్లీ కొత్తది మొలుస్తుంది. అది ఎట్లా సాధ్యమైందో అని ఎవరికి అర్థం కావడం లేదు. దీనిని శాస్త్రవేత్తలు ల్యాబ్ లో పెట్టి పరీక్షలు చేస్తున్నారు.
కొన్ని జంతువుల విచిత్రం ఏంటంటే, ఇవి పుట్టినప్పుడు ఎలా ఉంటాయో చనిపోయే వరకు కూడా అలాగే ఉంటాయి. కప్పల మాదిరి లేక బల్లుల మాదిరి రూపం మార్చుకోవు. నీటిలోనే పుడతాయి. నీటిలోనే పెరుగుతాయి. నీళ్లలోనే ముసలి వాయి సచ్చిపోతాయి. వీటికి భూమి మీద తిరిగి అలవాటు అసలు లేదు. అందుకే వీటిని నియోటెక్ జీవులు అంటారు. వీటికి ముసలోడైనా చిన్నపిల్లాడి మనస్తత్వం ఉంటుంది. దీని మొఖం చూస్తే ఎప్పుడు నవ్వుతున్నట్టు ఉంటుంది. ఇది పెద్ద వేటాడే జంతువు కాదు. చిన్న చిన్న చేపలను పురుగులను దొరికితే పట్టుకొని తింటుంది.
ఈ నీళ్ల డ్రాగన్లు మెక్సికోలో మెల్ల మెల్లగా అంతరించిపోతున్నాయి. సరస్సులు కలుషితం అయిపోవడం వలన పెద్ద పెద్ద చేపలు వచ్చి వీటిని తింటున్నాయి. ఇప్పుడు ఇవి అడవిలో కంటే మనుషుల ఇళ్లల్లో అక్వేరియంలో కనిపిస్తున్నాయి.
3. ఐ – ఐ ( Aye – Aye ) చేతి వేళ్లే డ్రిల్లింగ్ మెషిన్ లెక్క వాడుతది

ఐ – ఐ ( Aye – Aye ) ఇది ఆఫ్రికా పక్కన ఉన్న మడగాస్కర్ అనే అడవి దీవుల్లో ఉంటుంది. దీని మొఖం చూడ్డానికి అచ్చం గబ్బిలం మాదిరిగా ఉంటుంది. కానీ ఇది గబ్బిలం కాదు. కళ్ళు పెద్దగా ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా షాక్ అయినట్టు ఉంటాది. దీని తోక ఉడత కంటే పెద్దగా బుంగ మాదిరి ఉంటుంది. దీని పళ్ళు ఎలుక పళ్ళ మాదిరి ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి.
దీని దగ్గర చాలా మ్యాజిక్ లో ఉన్నాయి. దీని మ్యాజిక్కులు అన్ని మిడిల్ ఫింగర్ లోనే ఉంటాయి. వీటి చేతి వేళ్ళు చాలా సన్నగా ఉంటాయి. మధ్య వేలు ఇంకా సన్నగా పొడవుగా ఉంటుంది. ఇది దానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ వేలితో చెట్టు బెరడు మీద దీని వేలితో టక్ టక్ అని కొట్టి లోపల పురుగులు ఎక్కడ ఉన్నాయని సౌండ్ తో కనిపెడుతుంది. లోపల పురుగులు ఉన్నాయని తెలిసి పోగానే పళ్ళతోనే బెరడును కొరుకుతుంది. దానికి ఉన్న సన్నటి వేలను లోపలికి దూర్చి పురుగును బయటకు లాగి టపీమని తినేస్తుంది.
ఇది చెట్ల మీద గూడు కట్టుకొని పగటిపూట మంచిగా నిద్రపోతుంది. చీకటి పడ్డాక బయటకు వస్తుంది. ఇది చూసే వాళ్లకు దయ్యం మాదిరి కనిపిస్తుంది. అందుకే ఇదంటే అందరికీ భయం. దీన్ని చూసి చాలామంది చంపేస్తుంటారు. కానీ దీనికి స్వాదు స్వభావం ఉంటుంది. ఇది ఎవరికి కూడా ఎం కీడు చేయదు. అడవులను నరికి వేయడం వలన మరియు వీటిని భయంతో చంపడం వలన ఇవి అంతరించిపోతున్నాయి. ఇది చూడడానికి భయంకరంగా ఉన్న అడవికి మేలు చేస్తుంది. అడవిలో చెట్లకు పట్టిన పురుగులను తింటూ అడవులను కాపాడుతుంది.
