ఒక సినిమా విజయవంతం కావాలంటే కేవలం మంచి కథ ఉంటే సరిపోదు, ఆ కథను తెరపై ఎలా చూపిస్తున్నారనే విధానం చాలా ముఖ్యం. ఇక్కడే స్క్రీన్‌ప్లే (Screenplay) అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.
ఎంత గొప్ప కథ అయినా, దానికి సరైన స్క్రీన్‌ప్లే తోడవకపోతే ప్రేక్షకులకు బోర్ కొట్టడం ఖాయం. అదే పక్కా స్క్రీన్‌ప్లే పడితే, ఒక సాధారణ కథ కూడా ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది.
స్క్రీన్‌ప్లే అనేది సినిమాకు వెన్నెముక లాంటిది. ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి, ఎక్కడ ఎమోషన్ పండాలి, ఎక్కడ యాక్షన్ పేలాలి అనే విషయాలన్నీ దీనిపైనే ఆధారపడి ఉంటాయి.
మంచి స్క్రీన్‌ప్లే ఉన్న సినిమా ప్రేక్షకులను మొదటి ఫ్రేమ్ నుండి చివరి వరకు ఎక్కడా ఆసక్తి తగ్గకుండా చూసేలా చేస్తుంది. అసలు ఒక సినిమాని బ్లాక్ బస్టర్ గా మార్చడంలో స్క్రీన్‌ప్లే ప్రాముఖ్యత ఏమిటి? సినిమా నిర్మాణంలో అది ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
స్క్రీన్‌ప్లే అంటే ఏమిటి
అసలు ఈ స్క్రీన్ ప్లే అంటే ఏంటో చాలామందికి ఓ పెద్ద డౌట్ ఎప్పుడూ ఉంటుంది. కథ వేరు స్క్రీన్ ప్లే వేరు అని తెలిసినా ఆ రెండింటి మధ్య అసలు తేడా ఏంటో జనాలకు అంత త్వరగా అర్థం కాదు.
సినిమాల్లో స్క్రీన్‌ప్లే ప్రాముఖ్యత ఎంత ఉందంటే ఒక రకంగా ఇది సినిమాకి గుండెకాయ లాంటిది అని చెప్పాలి. డైరెక్టర్ల బుర్రలో ఉన్న పిచ్చి ఐడియాలను ఒక దారిలో పెట్టి పేపర్ మీద అక్షరాలుగా మార్చేదే ఈ స్క్రీన్ ప్లే.
స్క్రీన్‌ప్లే యొక్క నిర్వచనం
చాలా సింపుల్ గా చెప్పాలంటే ఒక సినిమా కథను సీన్ల వారీగా విడగొట్టి రాసిన రూపాన్ని స్క్రీన్ ప్లే అంటారు. అంటే తెర మీద ఏ టైంకి ఏ సీన్ పడాలో ముందుగానే ఒక పక్కా ప్లాన్ రాసుకోవడం అన్నమాట.
మనం గుడికి వెళ్లేటప్పుడు పూలు కొబ్బరికాయ అగరబత్తీలు వరుసగా ఎలా తీసుకెళ్తామో ఈ స్క్రీన్ ప్లే కూడా కథను అలాగే ఒక కరెక్ట్ ఆర్డర్ లో పెడుతుంది. లేకపోతే కొబ్బరికాయ కొట్టాక దేవుడికి దండం పెట్టుకున్నట్టు సినిమా మొత్తం రివర్స్ అయిపోయి జనాలకు పిచ్చెక్కుతుంది.
కథ అనేది ఒక అస్థిపంజరం అయితే దానికి కండరాలు నరాలు రక్తం పోసి ఒక మనిషిలా నిలబెట్టే పనే ఈ స్క్రీన్ ప్లే చేస్తుంది. ఏ సీన్ ఎంతసేపు ఉండాలి ఎక్కడ బోర్ కొట్టకుండా కట్ చేయాలి అనేది ఇందులో పక్కాగా రాసి ఉంటుంది.
స్క్రీన్‌ప్లేలో ఉండే ముఖ్యమైన అంశాలు
ఈ స్క్రీన్ ప్లే పేపర్ మీద ఏమేమి ఉంటాయో చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ముందుగా ఇందులో సీన్లు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో చాలా స్పష్టంగా రాసి ఉంటుంది.
హీరో ఇంట్రడక్షన్ సీన్ బస్టాండ్ లో జరగాలా లేక పబ్ లో జరగాలా పగలు తీయాలా రాత్రి తీయాలా అనేది ముందే ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనవి డైలాగులు.
హీరో హీరోయిన్ తో పులిహోర కలపాలా లేక విలన్ కు భయంకరంగా వార్నింగ్ ఇవ్వాలా అనేది ఇక్కడే రాస్తారు. డైలాగులు పేలితేనే కదా థియేటర్లో విజిల్స్ పడేది అందుకే ప్రతి ముక్కా చాలా జాగ్రత్తగా తూకం వేసి మరీ రాసుకుంటారు.
ఇక మూడోది యాక్షన్ వివరాలు. అంటే సీన్ లో హీరో గాలిలో ఎగరాలా లేక నేల మీద మామూలుగా నడవాలా అనేది కూడా రాసి పెట్టుకుంటారు. లేకపోతే ఫైట్ మాస్టర్ వచ్చి హీరోని తాటిచెట్టు ఎక్కించే ప్రమాదం ఉంది కదా.
చివరిగా పాత్రల ప్రవర్తన గురించి కూడా రాస్తారు. అంటే ఏ క్యారెక్టర్ ఏ సమయంలో ఎలా బిహేవ్ చేయాలో కూడా ఇందులో స్పష్టంగా చెబుతారు.
బాధపడే సీన్ లో నవ్వకూడదు కోపంగా ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండకూడదు కదా. ఒక యాక్టర్ ఏ ఏడుపు ఫేస్ పెట్టాలో ఎక్కడ ఎమోషన్ పండించాలో కూడా ఈ స్క్రీన్ ప్లే లోనే క్లియర్ గా మెన్షన్ చేస్తారు.
ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టే మనకు సినిమా థియేటర్లో అంత అద్భుతంగా అనిపిస్తుంది. లేకపోతే అదొక గందరగోళం జాతర లాగా తయారై ఎవరికీ ఏమీ అర్థం కాకుండా పోతుంది.
కథ మరియు స్క్రీన్ ప్లే మధ్య తేడా
చాలామందికి కథ అంటే ఏంటో తెలుసు కానీ ఈ స్క్రీన్ ప్లే అనగానే ఏదో అర్థంకాని బ్రహ్మవిద్య అనుకుంటారు. సినిమా వాళ్లు కూడా మైక్ దొరికితే చాలు మాది గొప్ప కథ అద్భుతమైన స్క్రీన్ ప్లే అని గట్టిగా అరుస్తుంటారు. కానీ నిజానికి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలిస్తే మనం కూడా ఓ అంచనాకు రావచ్చు.
ఒక అబ్బాయికి అమ్మాయి నచ్చింది వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు ఇద్దరూ లేచిపోయారు. ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా ఇదే మన ఇండస్ట్రీకి దశాబ్దాలుగా అన్నం పెడుతున్న అసలైన కథ. కానీ దీన్ని రెండున్నర గంటల పాటు బోర్ కొట్టకుండా ఎలా చూపించారు అనేదే స్క్రీన్ ప్లే చేసే మ్యాజిక్.
కథ అంటే ఏమిటి
కథ అనేది ఒక సినిమాకు పునాది లాంటిది లేదా ఒక ప్రధానమైన ఆలోచన అని చెప్పొచ్చు. మనం ఇల్లు కట్టాలనుకున్నప్పుడు మన బుర్రలో ఒక కల ఉంటుంది కదా నా ఇల్లు ఇలా ఉండాలి అని. ఆ ఆలోచన మాత్రమే కథ అవుతుంది.
అందులో హీరో ఎవరు విలన్ ఎవరు వాళ్ళ మధ్య ఉన్న గొడవ ఏంటి అనేది ఒక రెండు మూడు పేజీల్లో రాసుకుంటే దాన్ని స్టోరీ లైన్ అంటారు. అంటే కథ అనేది మనకు కేవలం ఒక దారి మాత్రమే చూపిస్తుంది కానీ ఆ దారిలో ఎన్ని మలుపులు ఉన్నాయో అస్సలు చెప్పదు.
కొందరు డైరెక్టర్లు కథను అద్భుతంగా అనుకుంటారు కానీ దాన్ని తెర మీద చూపించేసరికి గాలి తీసేసిన టైరు లాగా తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంత మంచి ఐడియా ఉన్నా దానికి సరైన ప్రాణం పోయడం కొంత మందికి చేతకాదు.
స్క్రీన్ ప్లే పాత్ర
ఇక స్క్రీన్ ప్లే పాత్ర గురించి చెప్పాలంటే ఇది ఆ ఇంటికి గీసిన ఒక పక్కా ఇంజనీరింగ్ ప్లాన్ లాంటిది. కథను ప్రేక్షకులకు ఎలా చూపించాలి ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి అని డిసైడ్ చేసేది ఇదే.
హీరో ఎంట్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ ట్విస్ట్ ఇవన్నీ ఏ టైంకి పడాలో ఈ స్క్రీన్ ప్లే పక్కాగా నిర్ణయిస్తుంది. ఉదాహరణకు బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది కథ అయితే దాన్ని రెండో పార్ట్ దాకా దాచిపెట్టి జనాలకు పిచ్చెక్కించిన విధానమే స్క్రీన్ ప్లే.
మనం హోటల్ కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ ఇస్తే వాడు ముందు సూప్ తెచ్చి ఆ తర్వాత స్టార్టర్స్ తెచ్చి లాస్ట్ లో బిర్యానీ పెడతాడు. ఈ ఆర్డర్ లో వస్తేనే మనకు తినాలనిపిస్తుంది అలా కాకుండా అన్నీ ఒకేసారి మొహాన కొడితే ఎవరికైనా కడుపు మండిపోతుంది.
సినిమా కూడా అంతే ఏ సీన్ ఎప్పుడు పడాలో అప్పుడే పడితే జనాలు థియేటర్లో ఈలలు వేస్తారు. లేదంటే మొదటి ఆటకే సినిమా ప్లాప్ అని బోర్డు తగిలించి సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోవడం ఖాయం.
స్క్రీన్ ప్లే సినిమా ఆసక్తిని ఎలా పెంచుతుంది
ఒక థియేటర్లో వందల మంది జనాలు రెండున్నర గంటల పాటు కదలకుండా కూర్చున్నారంటే అందులో హీరో గొప్పదనం కన్నా స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఏ ఎక్కువగా ఉంటుంది. అసలు జనాలు బయటికి వెళ్లకుండా కుర్చీలకు ఫెవికాల్ వేసి అంటించినట్లు కూర్చోబెట్టేది ఇదే.
కథ ఎంత అద్భుతంగా ఉన్నా దాన్ని చెప్పే విధానం బోరింగ్ గా ఉంటే మొదటి అరగంటకే జనాలు పబ్జి ఆడుకోవడం మొదలుపెడతారు. అందుకే ప్రతి నిమిషం తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ పెంచేలా ఈ స్క్రీన్ ప్లే రాసుకుంటారు.
సస్పెన్స్ మరియు ట్విస్టులు
మంచి స్క్రీన్ ప్లే ద్వారా కథలో ఎలాంటి ట్విస్టులు మరియు సస్పెన్స్ సృష్టించవచ్చు అంటే జనాలు ఆ దెబ్బకు సీట్లలో నుంచి ఎగిరి గంతేయాలి. మామూలుగా అయితే హీరో విలన్ ని కొట్టడం రొటీన్ కానీ విలన్ వెనుక ఉన్నది హీరో తండ్రే అని లాస్ట్ లో రివీల్ చేస్తే వచ్చే కిక్ వేరు.
మన తెలుగు డైరెక్టర్లు కొందరు ట్విస్ట్ అనగానే ఎప్పుడూ హీరో ఫ్రెండ్ ని వెన్నుపోటు పొడిచే ద్రోహిగా చూపించి మమ అనిపిస్తారు. కానీ అసలైన స్క్రీన్ ప్లే రాస్తే సినిమాలో ఏ క్యారెక్టర్ ని చూసినా వీడేమైనా తేడా గాడా అని మనకు అనుమానం రావాలి.
అలా ప్రతి ఫ్రేమ్ లో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ లాస్ట్ కి ఎవరూ ఊహించని క్లైమాక్స్ ఇస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రేక్షకుడి బుర్రతో దర్శకుడు ఆడుకునే ఒక కిరాక్ మైండ్ గేమ్ లాంటిది.
ప్రేక్షకుల ఆసక్తి నిలుపుకోవడం
ఈ రోజుల్లో జనాలు ముప్పై సెకన్ల యూట్యూబ్ షార్ట్స్ కే బోర్ ఫీల్ అయ్యి స్క్రోల్ చేస్తున్నారు అలాంటిది రెండున్నర గంటలు సినిమా చూడాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇక్కడే స్క్రీన్ ప్లే తన పవర్ చూపిస్తుంది సినిమా చివరి వరకు ప్రేక్షకులు ఆసక్తిగా చూడటానికి ఇది భలే సహాయపడుతుంది.
హీరో ఇంట్రడక్షన్ అయ్యాక కొంచెం సినిమా స్లో అవుతుంది అనుకునే టైంకి ఒక అదిరిపోయే ఫైట్ లేదా కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్ పడేలా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఆ సీన్ల అల్లిక ఎంత టైట్ గా ఉండాలంటే ప్రేక్షకుడికి వాష్ రూమ్ కి వెళ్లే గ్యాప్ కూడా దొరకకూడదు.
ఒకవేళ స్క్రీన్ ప్లే లూజ్ అయ్యి సీన్లు సాగదీస్తే జనాలు థియేటర్లలో కచ్చితంగా గురక పెట్టి నిద్రపోతారు లేదా ఫోన్లలో చాటింగ్ చేసుకుంటారు. అందుకే సినిమా మొదలైనప్పటి నుంచి శుభం కార్డు పడే వరకు జనాల ఫోకస్ స్క్రీన్ పైనే ఉండేలా చేయడమే ఒక గొప్ప స్క్రీన్ ప్లే కు ఉన్న లక్షణం.
పాత్రల అభివృద్ధిలో స్క్రీన్ ప్లే పాత్ర
సినిమా మొదట్లో హీరో ఒక మామూలు కుర్రాడు కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ ఊరినే కాపాడే దేవుడు అయిపోతాడు. ఈ మధ్యలో అతనికి ఆ రేంజ్ బిల్డప్ ఇచ్చి జనాలకు కనెక్ట్ చేసేది ఈ స్క్రీన్ ప్లే మాత్రమే.
మనం చూసే చాలా సినిమాల్లో హీరోల క్యారెక్టర్లు ఈ స్క్రీన్ ప్లే దయ వల్లే పండుతాయి. దర్శకుడు రాసుకున్న పేపర్ మీదే ఈ పాత్రల జాతకాలు అన్నీ ఆధారపడి ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఎంత పెద్ద స్టార్లు అయినా సరే జనాలకు అస్సలు ఎక్కరు.
ప్రధాన పాత్రల నిర్మాణం
ఒక సినిమాలో హీరో విలన్ పాత్రలు ఎలా అభివృద్ధి చెందుతాయో ఈ స్క్రీన్ ప్లే ద్వారా పక్కాగా నిర్ణయించబడుతుంది. పుట్టగానే ఎవడూ సూపర్ హీరో అయిపోడు కదా. అందుకే ముందు హీరో క్యారెక్టర్ ని నెమ్మదిగా పరిచయం చేస్తారు.
హీరో కాఫీ ఎలా తాగుతాడు, కోపం వస్తే ఎలా అరుస్తాడు, పది మందిని ఎలా కొడతాడు అనేది ప్రతి చిన్న డిటైల్ రాసుకుంటారు. విలన్ కూడా అంతే వాడు ఎందుకు అంత క్రూరంగా మారాడో ఒక ఫ్లాష్ బ్యాక్ వేసి మరీ వాడి క్యారెక్టర్ కు ఒక బరువు తీసుకొస్తారు.
మన తెలుగు సినిమాల్లో అయితే విలన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటే హీరోకి అంత ఎలివేషన్ వస్తుందని విలన్ క్యారెక్టర్ ని కూడా స్క్రీన్ ప్లే లో చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేస్తారు. ఈ బిల్డప్ అంతా సరిగ్గా ఉంటేనే సినిమాలో వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే థియేటర్లో జనాలు సీట్లలో నుంచి ఎగిరి గంతేస్తారు.
భావోద్వేగ అనుభూతి
సినిమాలో ఒక క్యారెక్టర్ ఏడుస్తుంటే థియేటర్లో జనాలు కూడా కర్చీఫ్ లు తీసి కళ్ళు తుడుచుకుంటున్నారంటే అది పక్కాగా ఈ స్క్రీన్ ప్లే చేసిన మ్యాజిక్. జనాలు ఆ పాత్రలతో కనెక్ట్ కావడానికి ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
ఒక మామూలు సీన్ లో హీరోయిన్ కి యాక్సిడెంట్ అయితే జనాలకు పెద్దగా ఫీలింగ్ రాదు. కానీ అంతకుముందు ఆ హీరోయిన్ ఎంత మంచిదో అందరికీ ఎంత సాయం చేసిందో రెండు మూడు సీన్లు వేసి ఆ తర్వాత యాక్సిడెంట్ చేస్తే అప్పుడు జనాల గుండెలు పిండేసినట్టు అవుతుంది.
ఈ ఎమోషన్ వర్కౌట్ అవ్వాలంటే సీన్ల ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి. హీరో గెలిచినప్పుడు మనమే గెలిచినట్లు అనిపించాలి. ఓడిపోయినప్పుడు మన ఇంట్లో వాడికి దెబ్బ తగిలినట్లు బాధ కలగాలి. ఇదంతా జరగాలంటే డైరెక్టర్ తన స్క్రీన్ ప్లే లో ఏడుపులు నవ్వులు అన్నీ కరెక్ట్ డోస్ లో దట్టించాలి.
ఏ కొంచెం తేడా కొట్టినా ఆ ఎమోషన్ కాస్తా సీరియల్ లో వచ్చే ఓవర్ యాక్షన్ లాగా మారిపోయి జనాలు పగలబడి నవ్వడం ఖాయం. అందుకే పాత్రలతో జనాలను ఏడిపించాలన్నా నవ్వించాలన్నా అది స్క్రీన్ ప్లే చేతిలోనే ఉంటుంది.
సినిమా పేసింగ్ ను నియంత్రించడం
సినిమా పేసింగ్ అంటే బండిని ట్రాఫిక్ లో ఎలా నడుపుతామో అచ్చం లాంటిది. ఎక్కడ స్పీడ్ పెంచాలి ఎక్కడ బ్రేక్ వేయాలి అనేది కరెక్ట్ గా తెలిస్తేనే జర్నీ సాఫీగా ఉంటుంది.
సినిమాలో కూడా ఏ సీన్ ఎంత సేపు ఉండాలి, ఎప్పుడు కథను పరుగులు పెట్టించాలి, అనేది స్క్రీన్ ప్లే పక్కాగా నియంత్రిస్తుంది. లేకపోతే డ్రైవర్ నిద్రపోయిన బస్సులాగా సినిమా ఎటో వెళ్లిపోయి, థియేటర్లో జనాలు సీట్ల కింద పడిపోవడం ఖాయం.
యాక్షన్ మరియు ఎమోషన్ బ్యాలెన్స్
సినిమాలో కేవలం యాక్షన్ ఉంటే జనాలు తలనొప్పి వచ్చి పారిపోతారు. అదే కేవలం ఏడుపులు ఉంటే టీవీ సీరియల్ అనుకుని నిద్రపోతారు. అందుకే ఎక్కడ యాక్షన్ ఎక్కడ ఎమోషన్ ఉండాలి. అనే విషయం స్క్రీన్ ప్లేలో ముందే ప్లాన్ చేస్తారు.
హీరో పది మందిని గాల్లోకి ఎగరేసి కొట్టిన తర్వాత ఒక చిన్న సెంటిమెంట్ సీన్ పడితే జనాలకు కాస్త ఊరట దొరుకుతుంది. మనం ఫుల్ గా మసాలా బిర్యానీ తిన్న తర్వాత కాస్త పెరుగు అన్నం తింటే కడుపుకి ఎలా చల్లగా ఉంటుందో ఇది కూడా అంతే.
కొందరు డైరెక్టర్లు ఉంటారు వాళ్లకు యాక్షన్ మీద ఉన్న పిచ్చితో పది నిమిషాలకు ఒక ఫైట్ పెట్టి థియేటర్లో జనాల చెవులు బద్దలు కొడతారు. అలా కాకుండా ఒక ఎమోషనల్ సీన్ పండిన తర్వాత దానికి లింక్ పెట్టి యాక్షన్ వస్తే ఆ కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది.
సినిమా వేగం
సినిమా బోర్ కాకుండా ఉండటానికి ఈ పేసింగ్ అనేది చాలా ముఖ్యమైనది. కథలో దమ్ము ఉన్నా కూడా స్క్రీన్ ప్లే లో స్పీడ్ లేకపోతే ప్యాసింజర్ ట్రైన్ లో ప్రయాణం చేసినట్లు జనాలకు చాలా చిరాకు వస్తుంది.
మొదటి సగం సినిమా మెల్లగా సాగినా ఇంటర్వెల్ కి వచ్చేసరికి ఒక హై ఇచ్చి సెకండ్ హాఫ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోవాలి. అప్పుడే జనాలకు తాము పెట్టిన టికెట్ డబ్బులకు న్యాయం జరిగినట్లు అనిపిస్తుంది.
లేకపోతే జనాలు సినిమా మధ్యలోనే బయటికి వచ్చి కౌంటర్లో డబ్బులు వెనక్కి అడుగుతారు. అలా కాకుండా హీరోగారు ఉదయం లేచి బ్రష్ చేసుకుని పేపర్ చదివే సీన్లను పది నిమిషాలు సాగదీసి చూపిస్తే జనాలకు పిచ్చెక్కి స్క్రీన్ మీద టమాటాలు వేస్తారు.
అనవసరమైన సాగదీతలు లేకుండా ఎంత వరకు చెప్పాలో అంత వరకే కట్ చేసి కథను స్పీడ్ గా చూపిస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది. అందుకే దర్శకుడికి పేసింగ్ మీద పక్కా పట్టు ఉండాలి.
ఒక డైరెక్టర్ కి తన సినిమా స్పీడ్ బ్రేకర్ల మీద వెళ్లే ఆటోలా ఉందా లేక హైవే మీద వెళ్లే రేసింగ్ కారులా ఉందా అని ఈ స్క్రీన్ ప్లే పేసింగ్ ద్వారానే ముందుగా అర్థమవుతుంది.
సినిమా నిర్మాణంలో స్క్రీన్ ప్లే ప్రాముఖ్యత
ఒక సినిమాను తెరకెక్కించడం అంటే మామూలు ముచ్చట కాదు. వందల మందితో కూడిన ఒక పెద్ద జాతర లాంటిది. ఈ గందరగోళంలో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా అందరినీ ఒకే తాటిపై నడిపించే పవర్ ఈ స్క్రీన్ ప్లేకు మాత్రమే ఉంది.
కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసేటప్పుడు చేతిలో పక్కా ప్లాన్ లేకపోతే కళ్ళు మూసుకుని హైవే మీద స్కూటర్ నడిపినట్టే ఉంటుంది. అందుకే ఈ స్క్రీన్ ప్లే అనేది సినిమా నిర్మాణంలో ఒక దేవుడి గ్రంథం లాగా అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
డైరెక్టర్ కు మార్గదర్శకం
సినిమాకి డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. కానీ ఆ షిప్ ఎటు వైపు వెళ్లాలో కరెక్ట్ గా దారి చూపే మ్యాప్ మాత్రం ఈ స్క్రీన్ ప్లేనే. సెట్ లో షూటింగ్ ఎలా చేయాలి అనే విషయానికి స్క్రీన్ ప్లే ఒక పక్కా గైడ్ లా ఉంటుంది.
దర్శకుడు ఉదయాన్నే సెట్ లోకి వెళ్లి ఈ రోజు ఏ సీన్ తీద్దాం అని ఆలోచిస్తూ తల గోక్కుంటే ప్రొడ్యూసర్ కి అప్పుడే సగం హార్ట్ ఎటాక్ రావడం ఖాయం. అలా జరగకుండా ఏ లొకేషన్ లో ఏ డైలాగ్ తో సీన్ తీయాలో ఇందులో ముందే రాసి పెట్టుకుంటారు.
మనం తెలియని ఊరు వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎంత కచ్చితంగా దారి చూపిస్తుందో డైరెక్టర్ కి కూడా ఇది అక్షరాలా అలాగే పనిచేస్తుంది. ఒకవేళ ఇది లేకుండా డైరెక్టర్ షూటింగ్ కి వెళ్తే కన్ఫ్యూజన్ లో హీరో ఏడ్చే సీన్ కి బదులు ఐటెం సాంగ్ తీసే ప్రమాదం ఉంది.
అందుకే ఈ పేపర్లు చేతిలో ఉంటే దర్శకుడు సెట్ లో రజనీకాంత్ లాగా ఫుల్ కాన్ఫిడెన్స్ తో సీన్లు తీసుకుంటూ వెళ్లిపోతాడు.
మొత్తం టీమ్ కు సహాయం
సినిమా అనేది డైరెక్టర్ ఒక్కడితో అయిపోయే పని కాదు కదా కెమెరా వెనుక వందల మంది కష్టపడతారు. సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ అలాగే యాక్టర్లకు కూడా ఇది చాలా స్పష్టమైన దిశ చూపుతుంది.
కెమెరామెన్ కు పగలు లైటింగ్ పెట్టాలా, రాత్రి ఎఫెక్ట్ ఇవ్వాలా, అనేది అలాగే ఎడిటర్ కు ఎక్కడ సీన్ కట్ చేయాలో, ఇది ముందుగానే ఒక క్లారిటీ ఇస్తుంది. నటీనటులు కూడా ఏ సీన్ లో ఎంత ఓవర్ యాక్షన్ చేయాలో లేదా ఎంత ఏడవాలో ఈ పేపర్లు చూసే ప్రాక్టీస్ చేస్తారు.
మొత్తానికి ఈ స్క్రీన్ ప్లే లేకుండా కోట్లు పెట్టి సినిమా తీయడం అంటే ఏమాత్రం ఈత రాకుండా సముద్రంలో దూకేయడం లాంటిదే. అందుకే షూటింగ్ మొదలుపెట్టే ముందు అందరూ ఈ స్క్రీన్ ప్లేనే పట్టుకుని దేవుడిలా పూజలు చేస్తారు.
ముగింపు
సరైన స్క్రీన్ ప్లే లేకపోతే ఎంత పెద్ద డైరెక్టర్ తీసిన సినిమా అయినా థియేటర్లలో గోడకు గుద్దుకుని డిజాస్టర్ అవ్వడం ఖాయం. ఒక రొటీన్ సాధారణ కథను కూడా అదిరిపోయే స్క్రీన్ ప్లే తోడైతే జనాలు కుర్చీలకు అతుక్కుపోయే బ్లాక్ బస్టర్ సినిమాగా మార్చవచ్చు. అందుకే సినిమా విజయానికి కథతో పాటు బలమైన స్క్రీన్ ప్లే కూడా ఎంతో కీలకం.