ఇంతకుముందు సినిమా రిలీజ్ అయితేనే హీరో ముఖం థియేటర్లో జనాలకు తెలిసేది. కానీ ఇప్పుడు పొద్దున్న లేచి మనం బ్రష్ చేసుకునే లోపే ఫోన్లో పది మంది హీరోల మొహాలు దర్శనం ఇస్తున్నాయి. సోషల్ మీడియా అనేది ఇప్పుడు నటులకు ఆక్సిజన్ సిలిండర్ లాగా మారిపోయింది. ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ లేకపోతే ఇండస్ట్రీలో వాళ్ళకి అడ్రస్ లేనట్టే లెక్క.
కెమెరా ముందు యాక్టింగ్ ఎలా చేసినా పర్లేదు కానీ చేతిలో ఫోన్ పట్టుకుని పక్కాగా రీల్స్ చేయడం మాత్రం కచ్చితంగా వచ్చి తీరాలి. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా అకౌంట్లో ఉన్న బ్లూ టిక్ మరియు ఫాలోవర్స్ లెక్కను బట్టే ఈ రోజుల్లో వాళ్ళకి అడ్వాన్సులు వస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే టాలెంట్ ని కూడా ఇప్పుడు లైకులు షేర్లు అనే త్రాసులో పెట్టి తూస్తున్నారు.
నిర్మాతలు కూడా హీరో డేట్స్ అడిగే ముందు ముందుగా యాప్ ఓపెన్ చేసి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు అని చెక్ చేస్తున్నారు. అసలు ఈ మాయా ప్రపంచంలో సోషల్ మీడియా నటుల పాపులారిటీపై ఎలా ప్రభావం చూపుతుంది. వాళ్ళ ఫేమ్ వెనుక పీఆర్ టీమ్ లు ఆడే నాటకాలు ఏంటి అనేది ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం.
ఓవర్ నైట్ లో స్టార్స్ ని చేసే సోషల్ మీడియా
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేవి. కానీ ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతున్నారు. సోషల్ మీడియా నటుల పాపులారిటీ మీద చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. అసలు టాలెంట్ తో పనే లేకుండా కేవలం యాప్ లతో ఫేమస్ అయిపోతున్న రోజులివి.
అభిమానులతో నేరుగా కనెక్ట్ అవ్వడం
ఒకప్పుడు హీరోకి ఉత్తరం రాస్తే అది చేతికి వెళ్ళిందో లేదో తెలియడానికి నెలలు పట్టేది. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ పుణ్యమా అని బెడ్ మీద నుంచి లేవగానే ఫ్యాన్స్ కి డైరెక్ట్ గా గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నారు. పండగ వస్తే చాలు ఫ్యామిలీ ఫోటోలు పెట్టి పబ్లిక్ తో బాగా క్లోజ్ అయిపోతున్నారు.
కారులో వెళ్తున్నా జిమ్ లో చెమట చిందిస్తున్నా ప్రతిదీ అప్డేట్ చేస్తూ అభిమానులకు తాము చాలా దగ్గర అని ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. ఇలా డైరెక్ట్ గా కనెక్షన్ పెంచుకుంటే, రేపు శుక్రవారం థియేటర్లో కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో పెరుగుతాయని PR టీమ్ లు వేస్తున్న పక్కా స్కెచ్ ఇది.
ఫాలోవర్స్ పెరగడం ద్వారా ఫేమ్ పెరగడం
సినిమాలో కనీసం ఏడుపు సీన్ సరిగ్గా చేయలేని వాళ్ళు కూడా అకౌంట్లో పది మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే, వాళ్ళను వాళ్ళు ఏకంగా హాలీవుడ్ హీరోల రేంజ్ లో ఊహించుకుంటున్నారు.
ఇప్పుడున్న జనరేషన్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అనే లెక్క మీదే వీళ్ళ ఇమేజ్ మరియు రేంజ్ డిసైడ్ అయిపోతుంది. పైగా ఇప్పుడు డైరెక్టర్లు కూడా ఆడిషన్స్ కంటే ముందు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని చూసే హీరోయిన్లని ఫిక్స్ చేస్తున్నారు, దీన్నే ఇండస్ట్రీలో కాస్టింగ్ ఫ్యాక్టర్ (Casting Factor) గా మార్చేశారు.
కార్పొరేట్ బ్రాండ్స్ కూడా అసలు వీడికి యాక్టింగ్ వచ్చా లేదా అని చూడటం మానేశాయి. ఎవరి అకౌంట్లో ఎక్కువ మంది జనాలు ఉంటే వాళ్ళకే కోట్లు పోసి యాడ్స్ ఇస్తున్నాయి.
దీన్నే ఇండస్ట్రీలో బ్రాండ్ ఎండార్స్మెంట్స్ (Brand Endorsements) అంటారు. అందుకే సోషల్ మీడియా నటుల పాపులారిటీ పెంచడానికి కొంతమంది PR ఏజెన్సీలను పెట్టి ఏకంగా ఫేక్ ఫాలోవర్స్ ని కూడా కొనేస్తున్నారు. పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి డబ్బులు ఇచ్చి మరీ ట్రెండ్ చేయించుకునే ఈ పెయిడ్ పీఆర్ (Paid PR) వ్యవహారం ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక పెద్ద చీకటి వ్యాపారం.
వైరల్ కంటెంట్ వల్ల ఓవర్ నైట్ ఫేమ్
పది సంవత్సరాలు కష్టపడి పది సినిమాలు చేసినా రాని గుర్తింపు కేవలం ముప్పై సెకన్ల ఇన్స్టాగ్రామ్ రీల్ తో ఒక్క రాత్రిలో వచ్చేస్తోంది. ట్రెండ్ కి తగ్గట్టు ఒక హిట్ పాట పట్టుకుని విచిత్రమైన స్టెప్పులతో షార్ట్ వీడియో చేస్తే చాలు. ఉదయం లేచేసరికి వాళ్ళ అకౌంట్ కి బ్లూ టిక్ వచ్చేస్తుంది.
ఇందుకు నిజమైన ఉదాహరణ ప్రియా ప్రకాష్ వారియర్. ఎవరికీ తెలియని ఆమె కేవలం కన్ను గీటిన ఒక్క చిన్న వీడియో వైరల్ అవ్వగానే, ఓవర్ నైట్ లో పాన్ ఇండియా రేంజ్ లో నేషనల్ క్రష్ అయిపోయి ఏకంగా భారీ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన టాలెంట్ కంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండటమే ఇండస్ట్రీలో పెద్ద సక్సెస్ ఫార్ములా అయిపోయింది.
సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీల పాపులారిటీ ఎలా పెరుగుతుంది
ఒకప్పుడు నటులు అంటే ఉదయం సెట్ కి వెళ్లి సాయంత్రం ప్యాకప్ చెప్పగానే ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చాక కూడా ఈ మొబైల్ యాప్ ల ముందు ఇంకో రకం యాక్టింగ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు బతుకంతా దీని మీదే నడుస్తుంది.
అసలు ఈ రోజుల్లో సోషల్ మీడియా నటుల పాపులారిటీ అమాంతం ఎలా పెంచేస్తుందో చూస్తే, అసలు వీళ్ళు సినిమాల్లో నటిస్తున్నారా లేక ఫోన్ల ముందు బిజినెస్ చేస్తున్నారా అనే డౌట్ రాకమానదు. వాళ్ళకి ఉన్న ప్రతి అకౌంట్ ని ఒక పెద్ద వ్యాపార సంస్థ లాగా మార్చేశారు.
పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవడం
ఇప్పుడు ఏ హీరో అయినా హీరోయిన్ అయినా సరే ఎవరికి వాళ్ళు ఒక పెద్ద అంతర్జాతీయ బ్రాండ్ లాగా ఫీల్ అయిపోతున్నారు. బయట రియల్ లైఫ్ లో వాళ్ళ గురించి ఎలాంటి టాక్ ఉన్నా సరే ఫోన్లో మాత్రం ఏకంగా దానకర్ణులు లాగా కలరింగ్ ఇస్తున్నారు.
ఒకడు ఎప్పుడూ జిమ్ లో భయంకరమైన బరువులు ఎత్తే ఫోటోలు పెడితే, ఇంకొకరు రోడ్డు మీద కుక్క పిల్లలతో ఆడుకునే ఫోటోలు పెట్టి పబ్లిక్ లో మామూలు సింపతీ కొట్టేయడం లేదు. దీనికోసం వాళ్ళు లక్షలు ఇచ్చి పెట్టుకున్న PR టీమ్ లు ఒక పక్కా స్కెచ్ వేస్తాయి.
వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియని ఒక కొత్త పవిత్రమైన క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఇంటర్నెట్ లో బతికిస్తున్నారు. ఎప్పుడూ ఒకే రకమైన డ్రెస్సింగ్ స్టైల్ లేదా ఒకే రకమైన డైలాగులు వాడుతూ, రోజువారీ పోస్ట్‌ల ద్వారా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఫిక్స్ చేసుకుంటున్నారు ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు.
రెగ్యులర్ అప్డేట్స్ మరియు ఎంగేజ్మెంట్
కొందరికి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ కెమెరాలో రికార్డ్ చేసి అప్డేట్ చేయకపోతే వీళ్ళకి రాత్రి పూట అన్నం అరగదు. కాఫీ తాగాను, కొత్త బట్టలు కొన్నాను, కుక్కకి బిస్కెట్ వేశాను లాంటి చెత్త విషయాలు కూడా రోజువారీ స్టోరీల్లో పెట్టి జనాల బుర్రలు తింటున్నారు.
పబ్లిక్ కూడా వీళ్ళు ఏ బ్రాండ్ సబ్బు వాడుతున్నారో ఏ ఖరీదైన హోటల్ లో తింటున్నారో అని అదే పనిగా చూస్తూ వాళ్ళ సొంత పనులు మానుకుని మరీ టైం వేస్ట్ చేస్తున్నారు. రోజుకు కనీసం రెండు మూడు పోస్టులు వేయకపోతే ఆ ‘సోషల్ మీడియా అల్గారిథమ్స్ వీళ్ళని పక్కకు నెట్టేస్తాయి అని PR టీమ్ కి తెగ భయం పట్టుకుంటుంది.
అందుకే వాళ్ళ అకౌంట్ లో ఎంగేజ్మెంట్ రేట్ (Engagement Rate) ఎక్కడా తగ్గకుండా ఉండటానికి లేనిపోని లైవ్ సెషన్స్ పెట్టి, వాళ్ళ అకౌంట్ల నుంచి వాళ్ళే ఫేక్ ప్రశ్నలు అడిగేసుకుని మరీ గొప్పగా రిప్లై ఇచ్చుకుంటున్నారు. ఇలా రోజుకో డ్రామా చేయడం వల్లే సోషల్ మీడియా నటుల పాపులారిటీ గ్రాఫ్ ఏమాత్రం పడిపోకుండా సేఫ్ జోన్ లో ఉంటున్నారు.
ప్రమోషన్స్ మరియు కొలాబరేషన్స్
ఒకప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా టీవీల్లో యాడ్స్ ఇచ్చేవాళ్లు లేదా ఎక్కడో గ్రౌండ్లో ఆడియో ఫంక్షన్ చేసి ఊరుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు జనరేషన్ ట్రెండ్ మారింది. ఎవరైతే బాగా పాపులర్ యూట్యూబర్లు మరియు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళ అకౌంట్లను ఈ హీరోలు భలే వాడుకుంటున్నారు.
సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్ళతో కలిసి పిచ్చి పిచ్చి స్టెప్పులు వేస్తూ ట్రెండింగ్ పాటలకు రీల్స్ చేస్తున్నారు. ఎందుకంటే జనాల చేతిలో ఎప్పుడూ ఆ యాప్స్ ఓపెన్ చేసే ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళ బుర్రల్లోకి సినిమా టైటిల్ ని బలంగా దించేస్తున్నారు ఇదే ఇప్పుడు అసలైన మార్కెటింగ్ స్ట్రాటజీ.
ఇంకోవైపు చూసుకుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ బ్రాండ్స్ కూడా వీళ్ళ క్రేజ్ ని బాగా వాడుకుంటున్నాయి. వీళ్ళు వాడే ఖరీదైన ఫోన్ నుంచి వేసుకునే బ్రాండెడ్ బట్టల వరకు అన్నీ ఈ కొలాబరేషన్స్ ద్వారా వచ్చిన ఫ్రీ ముచ్చట్లే ప్రతి పోస్ట్ కి లక్షల్లో ఛార్జ్ చేస్తారు.
ఒక పక్క సినిమా వాళ్ళ దగ్గర సినిమా ప్రమోషన్స్ పేరుతో అడ్వాన్సులు లాగుతూ, ఇంకో పక్క బ్రాండ్స్ దగ్గర కమిషన్లు కొడుతూ రెండు చేతులా బాగా సంపాదిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వీళ్ళు క్రియేటివ్ ఆర్టిస్టులా లేక ప్రొడక్ట్స్ అమ్మే సేల్స్ బాయ్స్ ఆ అని ఎవరికైనా చిరాకు రావడం పక్కా నిజం.
సోషల్ మీడియా వల్ల వచ్చే నెగటివ్ ప్రభావాలు
నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్టే ఈ రంగుల ప్రపంచంలో ఫోన్ వెలుతురు ఎంత ఉందో, దాని వెనుక అంత కంటే భయంకరమైన చీకటి కూడా దాగి ఉంది. లైకులు షేర్లు చూసుకుని మురిసిపోయే హీరోలకు ఒక చిన్న నెగటివ్ కామెంట్ వస్తే రాత్రి పూట నిద్ర కూడా పట్టదు. ఏసీ రూమ్ లో ఉన్నా కూడా చెమటలు పడతాయి.
సోషల్ మీడియా నటుల పాపులారిటీ మీద ఎంత పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందో అంతకంటే వంద రెట్లు నెగటివ్ ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది. ఒక్క సెకండ్లో ఆకాశానికి ఎత్తేసిన జనాలే ఇంకో సెకండ్లో పాతాళానికి తొక్కేస్తారు.
ట్రోలింగ్ మరియు నెగటివిటీ
పని పాట లేని వాళ్ళు అంతా ఒక రెండు వందలు పెట్టి ఇంటర్నెట్ ప్యాక్ వేయించుకుని, చేతిలో ఫోన్ పట్టుకుని పెద్ద జడ్జిల లాగా ఫీల్ అయిపోతుంటారు. ఫోన్ కీబోర్డ్ దొరికింది కదా అని హీరోల మీద హీరోయిన్ల మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతూ బూతులు తిడుతుంటారు. వాళ్ళకి ఇదొక పెద్ద టైంపాస్ ఆట లాగా మారిపోయింది.
హీరో సినిమా ప్లాప్ అయితే చాలు పండగ చేసుకుంటూ, దారుణమైన మీమ్స్ క్రియేట్ చేసి పైశాచిక ఆనందం పొందుతారు. ఈ ట్రోల్స్ చూసి మనకెందుకులే అని జనాలు లైట్ తీసుకుంటారు. కానీ ఆ నటులకు మాత్రం లోపల భయంకరమైన మెంటల్ ప్రెషర్ మొదలవుతుంది.
సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ గా ఆకాశానికి ఎత్తుతుందో, చిన్న తప్పు జరిగితే అంతే ఫాస్ట్ గా పాతాళానికి తొక్కేస్తుంది. జనాలు ఒక్కసారి నెగిటివ్ గా ఫిక్స్ అయితే వాళ్ళ కెరీర్ నే నాశనం చేసే ఈ ట్రెండ్ ని ఇంటర్నెట్ బాషలో క్యాన్సిల్ కల్చర్ (Cancel Culture) అంటారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ కామెంట్లు చూస్తే ఏమనుకుంటారు అనే భయం వాళ్ళని వెంటాడుతుంది.
ఒక వంద మంది పాజిటివ్ గా పొగిడినా కూడా పది మంది కావాలని చేసే హేట్ కామెంట్స్ వల్ల వాళ్ళ మైండ్ మొత్తం చెడిపోతుంది. ఈ నెగటివిటీ తట్టుకోలేక చాలా మంది నటులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి, ఆఖరికి ఆ ఫోన్ చూస్తేనే భయపడే పరిస్థితికి వచ్చేస్తున్నారు. కొంతమంది అయితే అకౌంట్లు డిలీట్ చేసి పారిపోతున్నారు.
ఫేక్ ఇమేజ్ మైంటైన్ చేయాల్సిన అవసరం
క్యామెరా ముందు మేకప్ వేసుకోవడం వాళ్ళ వృత్తి కానీ ఇప్పుడు సొంత ఇంట్లో కూడా మేకప్ వేసుకుని బతకాల్సిన దరిద్రం వచ్చేసింది. రియల్ లైఫ్ లో వాళ్ళకి ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి. కానీ పబ్లిక్ ముందు మాత్రం ఎప్పుడూ నవ్వుతూ మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని పర్ఫెక్ట్ గా కనిపించాలి.
ఇంట్లో చిరిగిన షార్ట్ వేసుకుని పాత సోఫాలో పడుకునే వాళ్ళు కూడా, ఫోన్ కెమెరా ఆన్ చేయగానే బ్రాండెడ్ బట్టలు వేసుకుని విదేశాల్లో ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు. ఈ సోషల్ మీడియా లైఫ్ కోసం వాళ్ళు బతుకుతున్న ఆ ఫేక్ ఇమేజ్ చూస్తే వాళ్ళకే ఒక్కోసారి అద్దం ముందు నిలబడాలంటే చిరాకు వస్తుంది.
బయట రోడ్డు మీద బండి పంక్చర్ అయితే మనలాగా పక్కన నిలబడి చూసే ఫ్రీడమ్ వాళ్ళకి ఉండదు. వెంటనే ఎవడో ఒకడు ఫోటో తీసి పరువు తీస్తాడు అని భయపడుతూ ఎప్పుడూ ఒక దొంగ మాస్క్ వేసుకుని తిరగాలి.
కాంట్రవర్సీలు వేగంగా స్ప్రెడ్ అవ్వడం
ఒకప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూలో తప్పుగా మాట్లాడితే అది పేపర్లో రావడానికి ఒక రోజు పట్టేది. కానీ ఇప్పుడు నోరు జారి ఒక్క చిన్న మాట అన్నా చాలు సెకన్ల వ్యవధిలో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది.
హీరో ఎక్కడైనా పబ్లిక్ లో తల గోక్కున్నా కూడా దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి, వాడికి ఆటిట్యూడ్ ఎక్కువ బలుపు ఎక్కువ అంటూ ఏవేవో కహానీలు అల్లేస్తారు. చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తూ, వాళ్ళ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం ఇప్పుడు నెటిజన్లకు చాలా కామన్ హాబీ అయిపోయింది.
మంచి విషయాలు పది మందికి తెలిసేలోపు వాళ్ళు చేసిన చిన్న తప్పులు లక్ష మందికి రీచ్ అయిపోతాయి. ఆఖరికి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో జరిగే చిన్న గొడవలు కూడా పబ్లిక్ లో పెద్ద రచ్చగా మారిపోతాయి. ఇంత భయంకరంగా ఈ ప్లాట్ఫార్మ్స్ వాళ్ళ ప్రశాంతతను లాగేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా లేకపోతే నటుల పాపులారిటీ ఎలా ఉండేది
అసలు ఒక క్షణం కళ్ళు మూసుకుని ఈ స్మార్ట్ ఫోన్లు యాప్‌లు లేని పాత రోజుల్లోకి వెళితే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. అప్పట్లో ఈ సోషల్ మీడియా నటుల పాపులారిటీ పెంచడానికి లేనప్పుడు, సినిమా రిలీజ్ అయితే తప్ప వాళ్ళ మొహం జనాలకు తెలిసేది కాదు.
హీరోలు ఎలా ఉన్నారో ఏ బట్టలు వేసుకున్నారో చూడాలంటే గురువారం వచ్చే సినిమా వారపత్రికల కోసం జనాలు కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూసే వాళ్ళు, ఇప్పుడైతే బాత్ రూమ్ లో ఉన్నా సరే సెల్ఫీలు తీసి పెడుతున్నారు. కానీ అప్పట్లో ఒక్క ఫోటో బయటకు రావాలంటే నెలలు పట్టేది.
మొత్తం టీవీ ఛానెళ్లు మరియు పేపర్ల మీద మాత్రమే ఆధారపడాల్సి రావడం వల్ల అప్పట్లో మీడియా వాళ్ళదే రాజ్యాంగం అన్నట్టు నడిచేది. ఏ రిపోర్టర్ కి కోపం వచ్చినా హీరో మీద నెగిటివ్ ఆర్టికల్ రాసేస్తే పబ్లిక్ కూడా అదే నిజం అని గుడ్డిగా నమ్మేసేవాళ్ళు వాళ్ళకి చెప్పుకోవడానికి వేరే దారి ఉండేది కాదు.
మైక్ దొరికిన వాడల్లా ఇష్టం వచ్చినట్టు కతలు అల్లుతుంటే, పాపం ఆ పాత తరం హీరోలు చేతులు కట్టుకుని మౌనంగా భరించేవారు. వాళ్ళకి కోపం వచ్చినా బాధ వచ్చినా కనీసం ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలన్నా కూడా, మళ్ళీ అదే మీడియా కాళ్ళు పట్టుకోవాల్సిన దరిద్రం అప్పట్లో ఉండేది.
కానీ ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మధ్యవర్తులతో పనే లేకుండా డైరెక్ట్ గా జనాలతో మాట్లాడేస్తున్నారు. ఎవడైనా కాస్త తేడాగా ఆర్టికల్ రాస్తే చాలు వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి వాడి బండారం బయటపెట్టి పరువు తీస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఇది రావడం నటులకు పక్కాగా వరం అనే చెప్పాలి.
మీడియా వాళ్ళ చుట్టూ తిరిగే పని లేకుండా వాళ్ళ సొంత అకౌంట్ ద్వారా వాళ్ళకి నచ్చినట్టు ప్రమోషన్లు చేసుకుంటున్నారు. ఈ చేతిలో ఉండే చిన్న డబ్బా వల్ల ఇప్పుడు ఏ హీరో అయినా సరే, తన ఇమేజ్ ని తన చేతుల్లోనే పెట్టుకుని తనకి తానే ఒక మీడియా ఛానెల్ లాగా మారిపోయాడు.
నా చివరి మాట
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాలెంట్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటేనే స్క్రీన్ మీద ఛాన్సులు వస్తున్నాయి. ఇదొక రెండు తలల పాము లాంటిది. కరెక్ట్ గా వాడితే కోట్లు కురుస్తాయి తేడా వస్తే ఉన్న పరువు మొత్తం గంగపాలు అవుతుంది. ఇటు క్రేజ్ పెంచడంలో అటు మెంటల్ టెన్షన్ ఇవ్వడంలో దీనికి ఇదే సాటి.
రాబోయే రోజుల్లో దీని ఎఫెక్ట్ ఇంకా పీక్స్ కి వెళ్లడం ఖాయం. ఫ్యూచర్ లో డైరెక్టర్లు ఆడిషన్స్ చేయకుండా ఇన్స్టాగ్రామ్ లైకులు చూసే హీరోలను ఫైనల్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే నటులు దీని మాయలో పడి కొట్టుకుపోకుండా జాగ్రత్తగా వాడుకుంటేనే, వాళ్ళ కెరీర్ సేఫ్ జోన్ లో ఉంటుంది లేకపోతే అంతే సంగతులు.
Leave a Reply