షూటింగ్ కి ముందే నటీనటులు, ప్రొడ్యూసర్ల మధ్య కాంట్రాక్టులు ఎలా సెట్ చేస్తారు

సినిమా కాంట్రాక్టులు ఎలా ఉంటాయి ఒప్పంద హ్యాండ్‌షేక్

సినిమా ఇండస్ట్రీలో బయట కనిపించేది గ్లామర్ అయితే, లోపల నడిచేది పక్కా బిజినెస్. కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా తీస్తున్నప్పుడు కేవలం మాటల మీద నమ్మకం కంటే, కాగితం మీద రాసుకున్న లెక్కలకే విలువెక్కువ. అందుకే ఒక హీరో సినిమా ఒప్పుకోగానే ముందుగా జరిగేది ‘కాంట్రాక్ట్’ సంతకాలు.

అసలు నటులు, నిర్మాతల మధ్య కాంట్రాక్టులు ఎలా ఉంటాయి? పారితోషికం, డేట్స్, ప్రమోషన్స్ విషయంలో సినిమా కాంట్రాక్టులు ఎలా ఉంటాయి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

సినిమా కాంట్రాక్టులు

సినిమా నిర్మాణంలో ఒక నిర్మాతకు, అందులో నటించే నటుడికి మధ్య జరిగే అధికారిక లావాదేవీల పత్రమే ఈ కాంట్రాక్ట్. ఇందులో ఇద్దరి హక్కులు, బాధ్యతలు స్పష్టంగా రాసి ఉంటాయి.

కాంట్రాక్ట్ యొక్క అర్థం

కాంట్రాక్ట్ అంటే చట్టబద్ధంగా (Legally) చెల్లుబాటు అయ్యే ఒక ‘అగ్రిమెంట్’ (Agreement). ఇది ప్రధానంగా డబ్బులు పెట్టుబడి పెట్టే నిర్మాతకు, సినిమా కోసం డేట్స్ ఇచ్చే నటుడికి మధ్య ఉంటుంది.

ప్రతి చిన్న కండిషన్‌ని స్టాంప్ పేపర్ మీద రాసి ఇద్దరూ సంతకాలు చేస్తారు. ప్రభాస్ లాంటి పాన్-ఇండియా హీరో ఒక బ్యానర్ లో సినిమా ఒప్పుకున్నప్పుడు, ప్రాజెక్ట్ మొదలవ్వక ముందే నిర్మాతతో ఈ లీగల్ అగ్రిమెంట్ పూర్తి చేస్తారు.

ఎందుకు అవసరం?

షూటింగ్ మొదలైనప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇద్దరి మధ్య పూర్తి క్లారిటీ (Clarity) కోసం ఇది అవసరం. భవిష్యత్తులో పారితోషికం విషయంలో గానీ, డేట్స్ విషయంలో గానీ ఎలాంటి గొడవలు రాకుండా ఈ అగ్రిమెంట్ అడ్డుకట్ట వేస్తుంది.

ఏవైనా కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆరు నెలలు లేట్ అయితే, హీరో మధ్యలో సినిమా వదిలేసి వెళ్ళిపోకుండా ఈ కాంట్రాక్ట్ నిర్మాతను సేవ్ చేస్తుంది.

సినిమా కాంట్రాక్టుల్లో ముఖ్యమైన విషయాలు

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కేవలం మాట మీద నిలబడేవాళ్లు అంటారు. కేవలం మాట మీద నమ్మకం తో కోట్లు ఇచ్చేవాళ్లు. కానీ షూటింగ్ సగం అయ్యాక హీరోగారు అదనపు రెమ్యునరేషన్ అడిగినా, లేదా ప్రొడ్యూసర్ డబ్బులు ఎగ్గొట్టినా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి.

ఆ నమ్మకం వల్ల ఎంతోమంది నిర్మాతలు రోడ్డున పడ్డారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ (Amazon) లాంటి పెద్ద ఓటీటీ సంస్థలు, పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌసెస్ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది.

ఒకప్పుడు చేతి రాతతో ఇచ్చే అడ్వాన్సులు పోయి, ఇప్పుడు వందల పేజీల బౌండ్ కాంట్రాక్ట్స్ (Bound Contracts) వచ్చాయి. లీగల్ టీమ్స్ కూర్చుని మరీ ప్రతి చిన్న పాయింట్ ని అగ్రిమెంట్ లో పక్కాగా పెడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆ మాటలన్నీ కాగితాల మీదకి ఎక్కాయి.

ముఖానికి మేకప్ వేసుకునే ముందు ఆ పేపర్ల మీద ఏమేం రాశారో భూతద్దం పెట్టి మరీ చూసుకుంటారు మన హీరోలు. ఎందుకంటే కాంట్రాక్ట్ లో ఏ చిన్న ముక్క తేడా వచ్చినా రాత్రికి రాత్రే కోట్లలో లాస్ వస్తుంది కదా. అసలు ఈ కోట్ల రూపాయల వ్యవహారంలో పక్కాగా రాసుకునే సినిమా కాంట్రాక్టులు ఎలా ఉంటాయి, అందులో ఏముంటాయో ఇప్పుడు చూద్దాం.

పారితోషికం వివరాలు

కాంట్రాక్ట్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది డబ్బులే కదా. నటుడికి మొత్తం ఎంత పారితోషికం ఇస్తారు అనేది పక్కాగా రాసుకుంటారు. సినిమా హిట్ అయితే పర్లేదు కానీ ప్లాప్ అయితే ప్రొడ్యూసర్ ముఖం చాటేయకుండా ముందే లెక్కలు తేల్చుకుంటారు.

ఇక్కడ ఒక పక్కా ఇండస్ట్రీ పేమెంట్ రూల్ ఉంటుంది. కాంట్రాక్ట్ లో ముందే డబ్బులు ఎలా ఇస్తారో అని ఒక స్ట్రక్చర్ రాస్తారు.

20% అడ్వాన్స్ (Signing Amount): అగ్రిమెంట్ మీద సంతకం పెట్టగానే ఇచ్చేది.

40% ప్రొడక్షన్ పేమెంట్: షూటింగ్ జరుగుతున్నప్పుడు, కాల్ షీట్స్ ని బట్టి ఇచ్చేది.

40% ఫైనల్ పేమెంట్: డబ్బింగ్ చెప్పే ముందు లేదా సినిమా రిలీజ్ కి ముందు క్లియర్ చేసే అమౌంట్.

ఇందులో అడ్వాన్స్ పేమెంట్ కింద ముందే డబ్బులు లాగేస్తారు మన స్టార్లు. ఉదాహరణకి ఈ అడ్వాన్స్ అమౌంట్ అకౌంట్లో పడకపోతే హీరో సెట్ లోకి కాలు కూడా పెట్టడు అన్నమాట. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ని పైన చెప్పినట్టు డబ్బింగ్ చెప్పే టైంకి ఇస్తారా లేక రిలీజ్ కి ముందు ఇస్తారా అని ఈ కాంట్రాక్ట్ లోనే క్లియర్ గా రాసుకుంటారు.

షూటింగ్ తేదీలు

కాల్ షీట్లు (Call Sheets) అంటారు చూశారా అవే ఇవి. హీరో ఎప్పుడు షూటింగ్ కి రావాలి, రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి అని వివరంగా రాస్తారు. ఉదయం తొమ్మిదికి వస్తాడా లేక మధ్యాహ్నం భోజనం చేశాక మెల్లగా వస్తాడా అనేది ముందే ఫిక్స్ అవుతుంది.

ఒకవేళ హీరో సినిమాకి వంద రోజులు డేట్స్ ఇచ్చి ఆ తర్వాత రానంటే నిర్మాత పరిస్థితి గాల్లో దీపం పెట్టినట్టే. అందుకే పాన్ ఇండియా స్టార్స్ అయినా సరే కరెక్ట్ గా ఇన్ని రోజులు పని చేయాలి అని రాస్తారు. కొంతమంది స్టార్ హీరోలు రేషన్ షాపులో సరుకుల్లాగా నెలకి నాలుగే రోజులు డేట్స్ ఇస్తుంటారు అదో పెద్ద కామెడీ.

ఇలాంటి డేట్స్ తో పాటు ఇదే సెక్షన్ లో ఫోర్స్ మజ్యూర్ (Force Majeure) అనే స్పెషల్ క్లాజ్ కూడా ఉంటుంది. అంటే సడెన్ గా కరోనా లాంటివి వచ్చినా, భారీ వర్షాలు, భూకంపాలు (యాక్ట్ ఆఫ్ గాడ్) జరిగి షూటింగ్ ఆగిపోతే డేట్స్ ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎవరికి ఎంత నష్టం వస్తుందో ముందే పక్కా క్లారిటీతో ఈ అగ్రిమెంట్ లో సెట్ చేసుకుంటారు.

పాత్ర మరియు బాధ్యతలు

నటుడు ఏ పాత్రలో నటిస్తున్నాడు అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఇందులో రాస్తారు. అంటే సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తాడా లేక కామెడీ విలన్ గా చేస్తాడా అని ముందే ఒక అండర్ స్టాండింగ్ కి వస్తారు.

ఇందులో పెర్ఫార్మెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి బాహుబలి లాంటి సినిమాకి సిక్స్ ప్యాక్ చేయాలి లేదా గుండు కొట్టించుకోవాలి అని ఉంటే అవి కూడా కాంట్రాక్ట్ లో పెడతారు. దానికి అయ్యే జిమ్ ఖర్చులు డైట్ ఖర్చులు కూడా నిర్మాత నెత్తినే పెడతారు.

ఇతర సినిమాలపై నియమాలు

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో వేరే సినిమా చేయొచ్చా లేదా అని గట్టి రూల్స్ పెడతారు. ఎందుకంటే ఈ సినిమాలో క్లీన్ షేవ్ తో ఉండి పక్క సినిమాలో గడ్డం పెంచితే ఇక్కడ కంటిన్యూటీ దెబ్బతింటుంది కదా.

ఒకవేళ రెండు సినిమాలు ఒకేసారి చేస్తే డేట్స్ క్లాష్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. అంటే సోమవారం ఇక్కడ షూటింగ్ ఉంటే మంగళవారం అక్కడ పెట్టుకో అని చెప్తారు. లేదంటే రెండు పడవల మీద కాలు వేసినట్టే అవుతుంది రెండు సినిమాల నిర్మాతలు టెన్షన్ పడాలి.

కాంట్రాక్ట్ రద్దు నిబంధనలు

ఇది సినిమా వాళ్ళకి ఒక రకంగా ముందస్తు వార్నింగ్ లెటర్ లాంటిది. ఒకవేళ ఏ గొడవైనా వచ్చి నటుడు మధ్యలో సినిమా వదిలేస్తే పరిస్థితి ఏంటి అన్నది ముందే రాసుకుంటారు. ఎంత పరిహారం కట్టాలి అనేది కూడా ఇక్కడే తేల్చేస్తారు.

సగం సినిమా అయ్యాక నాకు డైరెక్టర్ నచ్చలేదు నేను వెళ్ళిపోతా అంటే అస్సలు కుదరదు. వెళ్ళేముందు తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయాలి. దానికి తోడు నిర్మాతకు అప్పటివరకు అయిన ఖర్చులకి కాంపెన్సేషన్ కూడా గట్టిగా కట్టాలి లేదంటే లీగల్ నోటీసులు ఇంటికి వస్తాయి.

నటులకు చెల్లించే విధానాలు

సినిమా వాళ్ళ లెక్కలు మామూలుగా ఉండవు. ప్రొడ్యూసర్ జేబులు ఎలా ఖాళీ అవ్వాలో హీరోల అకౌంట్లు ఎలా నిండాలో ఈ చెల్లింపు విధానాలే డిసైడ్ చేస్తాయి. ఎవరి మార్కెట్ ని బట్టి వాళ్ళు ఏ స్టైల్ లో డబ్బులు వసూలు చేయాలో ముందే ఓ పక్కా ప్లాన్ వేసుకుంటారు. సినిమా బడ్జెట్ లో సగానికి పైగా వీళ్లకే పోతుంది అంటే నమ్మండి.

ఫిక్స్‌డ్ పారితోషికం

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఫాలో అయ్యే పద్ధతి ఇదే. సినిమా సూపర్ హిట్ అయినా లేదా అట్టర్ ఫ్లాప్ అయినా నాకు సంబంధం లేదు ముందు మాట్లాడుకున్న డబ్బులు నా అకౌంట్లో పడాల్సిందే అని అడిగే రకం ఇది. ముందే ఒక ఫిక్స్డ్ రేటు మాట్లాడుకుని కాంట్రాక్ట్ చేసుకుంటారు.

రేపు పొద్దున థియేటర్లో జనాలు లేక ఈగలు తోలుకున్నా సరే ఈ హీరోలు మాత్రం తమ రెమ్యునరేషన్ తో కొత్త కారు కొనుక్కుని ప్రశాంతంగా తిరుగుతారు. పాపం ప్రొడ్యూసర్ మాత్రం అప్పులు కట్టలేక ఫైనాన్షియర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు.

లాభాల్లో వాటా

ఇది కొంచెం తెలివైన హీరోలు ఆడే పెద్ద గేమ్ అన్నమాట. సినిమా కథ మీద లేదా డైరెక్టర్ మీద విపరీతమైన నమ్మకం ఉన్నప్పుడు ముందుగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేరుగా లాభాల్లో వాటా అడుగుతారు.

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్లాక్ బస్టర్ కొడితే ప్రొడ్యూసర్ తో పాటు హీరో కూడా రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తుతాడు. అదే సీన్ రివర్స్ అయ్యి సినిమా డిజాస్టర్ అయితే మాత్రం ఇద్దరూ కలిసి ఒకే గదిలో కూర్చొని బాధపడటమే. సినిమా పోతే హీరోకి కూడా చిల్లిగవ్వ రాదు.

మిక్స్ మోడల్

ఇది అందరికంటే సేఫ్ అండ్ స్మార్ట్ ప్లే. అంటే తమ బేసిక్ ఖర్చుల కోసం కొంత పారితోషికం తీసుకుంటూనే సినిమా లాభాల్లో కూడా మళ్ళీ ఒక ముప్పై నలభై శాతం వాటా లాగేస్తారు మన టాప్ స్టార్లు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పెద్ద హీరోలు చేసేది ఇదే.

సినిమా ఫ్లాప్ అయినా చేతిలో అప్పటికే కొన్ని కోట్లు ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ హిట్ అయితే మాత్రం ముందు తీసుకున్న దానికి ఈ లాభాలు కూడా యాడ్ అయ్యి డబుల్ ధమాకా వస్తుంది.

ప్రొడ్యూసర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే అటు అడ్వాన్సులు ఇచ్చి ఇటు వచ్చిన లాభాలు హీరోతో పంచుకుంటూ చివరికి సగం సన్యాసి లాగా మిగిలిపోతాడు.

కాంట్రాక్టుల్లో ఉండే గోప్యమైన విషయాలు

సినిమా వాళ్ల కాంట్రాక్టులు చూస్తే మన రాజకీయ నాయకుల రహస్య ఒప్పందాలు కూడా చిన్నబోతాయి. బయట మాత్రం అందరూ అన్నదమ్ముల్లా కౌగిలించుకుంటారు. కానీ లోపల ఆ కాగితాల్లో రాసుకునే కండిషన్లు చూస్తే దిమ్మతిరిగిపోతుంది. అసలు బయటి ప్రపంచానికి తెలియకుండా వీళ్లు దాచిపెట్టే ఆ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

గోప్యత నిబంధనలు

ఇది అగ్రిమెంట్ లో ఉండే పెద్ద బ్రహ్మాస్త్రం లాంటిది. ఇండస్ట్రీలో దీన్నే NDA (Non-Disclosure Agreement) అంటారు. సినిమా కథ బయటికి లీక్ చేయకూడదు, అలాగే నాకు నిర్మాత ఇన్ని కోట్లు ఇచ్చాడు, నాకు ఆ ఫెసిలిటీలు ఇచ్చాడు అని ఏ హీరో కూడా బయట మైకు పట్టుకుని చెప్పకూడదు. ఈ ముచ్చట్లు గనుక పొరపాటున పక్క సినిమా వాళ్లకి తెలిస్తే మార్కెట్ మొత్తం గబ్బులేచిపోతుంది.

ఒకవేళ ఏ ఇంటర్వ్యూలోనో నోరు జారి కథ లేదా రెమ్యునరేషన్ ముచ్చట్లు చెబితే మాత్రం నిర్మాత వేసే ఫైన్ కి పారితోషికం సగం తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. అందుకే వీళ్లు బయట ఎంత సైలెంట్ గా ఉంటారో అగ్రిమెంట్ లో అంత మ్యాటర్ ఉంటుందన్నమాట.

డబ్బింగ్ మరియు రీషూట్

షూటింగ్ అయిపోగానే హీరోల పని అయిపోయినట్టు కాదు. డబ్బింగ్ ఎవరు చెప్పాలి అన్నది కూడా ఇక్కడే ఫిక్స్ చేస్తారు. ఏ రోజైనా డైరెక్టర్ కి మూడ్ వచ్చి మళ్లీ తీసిన సీన్ తీస్తా అంటే హీరోగారు అదనంగా డబ్బులు అడగకుండా వచ్చి నటించాలి అని రాసుకుంటారు.

సరిగ్గా సినిమా రిలీజ్ ముందు రీషూట్ అంటే హీరోలు ఎక్కడ హ్యాండ్ ఇస్తారో అని నిర్మాతలు ముందే ఈ కండిషన్ పెడతారు. అంటే ఉచితంగా ఎక్స్ ట్రా డ్యూటీలు చేయించుకోవడానికి ప్రొడ్యూసర్లు వేసే పెద్ద స్కెచ్ అన్నమాట ఇది.

లుక్ మరియు ఇమేజ్

సినిమా పూర్తయ్యే వరకు హీరో జుట్టు కత్తిరించకూడదు బాడీ షేప్ మార్చకూడదు అని గట్టి రూల్స్ పెడతారు. అంటే ఇంట్లో పెళ్ళాం వండిపెట్టినా సరే డైట్ పేరుతో కడుపు మాడ్చుకోవాల్సిందే. బాహుబలి కోసం హీరోలు ఐదేళ్లు ఒకే లుక్ లో ఎలా ఉన్నారో మీకు తెలిసిందే.

దీనితో పాటు సినిమా రిలీజ్ టైం లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కచ్చితంగా రావాలి టీవీ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వాలి అని కూడా కాంట్రాక్ట్ లో రాస్తారు. ప్రమోషన్స్ కి రాకపోతే మిగిలిన డబ్బులు ఇవ్వను అని నిర్మాత ముందే చెక్ పెడతాడు.

కాంట్రాక్టులతో వచ్చే సమస్యలు

సినిమా కాంట్రాక్టులు రాసుకోవడం వరకే బాగుంటుంది కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. హీరోలు నిర్మాతలు కాగితాల మీద సంతకాలు పెట్టేటప్పుడు ఇచ్చే పోజులు ప్రాజెక్ట్ సగం అయ్యాక ఉండవు. ఇద్దరి మధ్య చిన్న తేడా వచ్చినా సరే సినిమా ఆగిపోయి కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి.

పారితోషిక సమస్యలు

కాంట్రాక్ట్ లో ఎంత రాసుకున్నా నిర్మాత టైంకి డబ్బులు ఇవ్వకపోతే హీరోలు సెట్ కి రాకుండా క్యారవాన్ లోనే కూర్చుంటారు. అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత మిగతా డబ్బులు సినిమా రిలీజ్ ముందు ఇస్తా అని చేతులెత్తేస్తే అప్పుడు మొదలవుతుంది అసలు రచ్చ.

డబ్బులు అకౌంట్లో పడేవరకు నేను డబ్బింగ్ చెప్పను, అని హీరోలు భీష్మించుకు కూర్చుంటే ప్రొడ్యూసర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. పారితోషికం కోసం ఒకరి మీద ఒకరు ఛాంబర్ లో కంప్లైంట్లు ఇచ్చుకుని పరువు తీసుకునే సంఘటనలు ఇండస్ట్రీలో చాలానే చూస్తుంటాం.

తేదీల సమస్యలు

హీరోలు ఒకేసారి మూడు నాలుగు సినిమాలు లైన్లో పెడితే పాపం డైరెక్టర్లు నిర్మాతలు కళ్లు కాయలు కాసేలా డేట్స్ కోసం ఎదురుచూడాలి. ఒక సినిమా షూటింగ్ కాస్త లేట్ అయినా సరే ఆ ఎఫెక్ట్ పక్క సినిమా మీద పడి మొత్తం షెడ్యూల్స్ గాలికి ఎగిరిపోతాయి.

మా హీరోగారు ఇంకా ఆ పాత సినిమా గెటప్ లోనే ఉన్నాడు. మాకు ఇంకో నెల డేట్స్ కావాలి అని మేనేజర్లు చెప్పగానే ప్రొడ్యూసర్ కి హార్ట్ ఎటాక్ వస్తుంది. వడ్డీలు కట్టలేక నిర్మాతలు జుట్టు పీక్కుంటుంటే హీరోలు మాత్రం ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్పులు వేసి ఎంజాయ్ చేస్తుంటారు.

లీగల్ సమస్యలు

కాంట్రాక్ట్ లో ఉన్న కండిషన్లు ఎవరైనా బ్రేక్ చేస్తే ఇక డైరెక్ట్ గా కోర్టు నోటీసులే పలకరిస్తాయి. సినిమా మధ్యలో డైరెక్టర్ కి హీరోకి పడకపోయినా లేదా నిర్మాతకి హీరోకి లెక్కలు తేలకపోయినా ఈ లీగల్ గొడవలు స్టార్ట్ అవుతాయి.

ఒకసారి కోర్టు మెట్లు ఎక్కారంటే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో దేవుడికే తెలియాలి. అందుకే కోర్టుల దాకా వెళ్లకుండా పెద్దమనుషులతో కూర్చుని సెటిల్మెంట్లు చేసుకుంటారు. లేదంటే ఇరుక్కున్న నిర్మాత పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారుతుంది.

కాంట్రాక్టులు ఎందుకు ముఖ్యమైనవి

సినిమా తీయడం అంటే ఊళ్ళో జాతర చేసినంత ఈజీ వ్యవహారం కాదు. ఎందుకంటే ఇక్కడ అడుగడుగునా కోట్ల రూపాయల వ్యాపారం దాగి ఉంటుంది. మాటల మీద నమ్మకంతో ముందడుగు వేస్తే ఎప్పుడో ఒకప్పుడు ఇండస్ట్రీలో మునిగిపోవడం ఖాయం. అందుకే కాగితం మీద రాసుకునే ఈ అగ్రిమెంట్లు అందరికీ ప్రాణసంకటం లాంటివి.

కాంట్రాక్టులు లేకపోతే ఇండస్ట్రీలో ఎవరూ ఎవరి మాట వినరు. ఒకరికొకరు ఇచ్చుకునే మాటలు గాలికి పోతాయి. కానీ స్టాంప్ పేపర్ల మీద పెట్టిన సంతకాలు మాత్రమే కోర్టులో సాక్ష్యాలుగా నిలబడతాయి. అసలు ఇవి ఎందుకు అంత అవసరమో ఈ ముచ్చట్లు చదివితే మీకే ఒక క్లారిటీ వస్తుంది.

నిర్మాతకు ఉపయోగం

సినిమా ఇండస్ట్రీలో నిర్మాత అంటే అందరికీ ఒక ATM మిషన్ లాగా కనిపిస్తాడు. ఆయన బడ్జెట్ కంట్రోల్ లో ఉండాలంటే ముందుగా ఈ కాగితాల మీద లెక్కలు పక్కాగా రాసుకోవాలి. లేదంటే సినిమా సగం అయ్యాక బడ్జెట్ డబుల్ అయిపోయి ఆయన రోడ్డు మీద పడటం పక్కా.

హీరోగారికి రోజూ తినడానికి ఎన్ని కోళ్లు కావాలి, మేకప్ మాన్ కి ఎంత ఇవ్వాలి, లాంటివి ముందే ఫిక్స్ చేసుకుంటే ప్రొడ్యూసర్ కి టెన్షన్ ఉండదు. అగ్రిమెంట్ గట్టిగా లేకపోతే హీరోల ఎక్స్ ట్రా ఖర్చులకే పాపం నిర్మాత తనకున్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది.

నటుడికి ఉపయోగం

హీరోలు కెమెరా ముందు యాక్షన్ అనగానే రెచ్చిపోయి ఫైట్లు డాన్సులు చేసేది కేవలం అభిమానుల చప్పట్ల కోసం మాత్రమే కాదు కదా. వాళ్లకు పేమెంట్ సెక్యూరిటీ ఉండాలంటే ఈ కాంట్రాక్ట్ మస్ట్ అండ్ షుడ్ అప్పుడే వాళ్ల అకౌంట్లో డబ్బులు కరెక్ట్ టైంకి పడతాయి.

ప్లాప్ అయితే ప్రొడ్యూసర్ రాత్రికి రాత్రే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయినా, ఈ కాగితం చూపిస్తే హీరోలకు రావాల్సిన డబ్బులు ఎక్కడికీ పోవు. ఒకవేళ కాంట్రాక్ట్ లేకపోతే హీరోలు ఉచితంగా సమాజ సేవ చేసినట్టే లెక్క అందుకే హీరోలు దీనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు.

సినిమా కోసం ఉపయోగం

సినిమా అంటే ఒకరిద్దరితో అయ్యే పని కాదు. వందలాది మంది టెక్నీషియన్లు ఆర్టిస్టులు అంతా కలిసి పనిచేస్తేనే ఆ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి స్మూత్ గా పూర్తవుతుంది. ఈ అగ్రిమెంట్లు కరెక్ట్ గా ఉంటేనే ఎవరి పని వాళ్లు పద్ధతిగా చేసుకుని వెళ్తారు.

మధ్యలో ఎవరికి కోపం వచ్చినా సినిమా ఆగిపోకుండా ఈ కఠినమైన రూల్స్ కాపాడతాయి, లేదంటే ముహూర్తం షాట్ రోజే కొబ్బరికాయ కొట్టి ప్యాకప్ చెప్పేసి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోవాల్సి వస్తుంది. కాంట్రాక్ట్ భయం ఉంటేనే సినిమా అనే బండి పక్కాగా పట్టాలెక్కి థియేటర్ల వరకు వస్తుంది.

చివరికి కాంట్రాక్టుల వల్ల ఎవరికి ఎన్ని కష్టాలు ఉన్నా లాభం జరిగేది మాత్రం సినిమాకే షూటింగ్ లో క్లారిటీ ఉంటేనే సినిమా స్మూత్ గా పూర్తవుతుంది లేదంటే మధ్యలోనే ఆగిపోయి యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ లాగా మిగిలిపోతుంది.

నా చివరి మాట

సినిమా ఇండస్ట్రీలో కాంట్రాక్ట్ పేపర్ అనేది పెళ్లి మంత్రాల కంటే పవిత్రమైనది. హీరో నిర్మాత ఇద్దరూ ఒకరికొకరు పూల దండలు మార్చుకున్నంత ఈజీ కాదు ఈ కాగితాల మీద సంతకాలు పెట్టడం.

ముందే అన్నీ క్లియర్ గా మాట్లాడుకుని రాసుకుంటే రేపు పొద్దున సినిమా ప్లాప్ అయినా హిట్ అయినా ఒకరి జుట్టు ఒకరు పీక్కునే అవకాశం ఉండదు. ముఖానికి మేకప్ వేసుకునే ముందే ఈ లెక్కలు తేల్చుకోవడం ఇద్దరికీ మంచిది.

ఇలాంటి కాంట్రాక్టులు గట్టిగా ఉండటం వల్లే మనకు సినిమాలు కరెక్ట్ టైంకి థియేటర్లలో కనిపిస్తున్నాయి. లేదంటే సినిమా సగం అయ్యాక హీరో అలిగి ఇంట్లో కూర్చుంటే పాపం నిర్మాత రోడ్డు మీద టెంట్ వేసుకుని అడుక్కోవాల్సిందే.

అగ్రిమెంట్ లో పక్కా క్లారిటీ ఉంటేనే షూటింగ్ అనే బండి ఎలాంటి బ్రేకులు లేకుండా ఎంచక్కా రిలీజ్ స్టేషన్ చేరుకుంటుంది. అందుకే ఇండస్ట్రీలో కాంట్రాక్ట్ ఉంటేనే సినిమాకు ప్రాణం లేదంటే అందరికీ నరకం అవుతుందనేది నా మాట.

About PARUGU Founder 27 Articles
నమస్కారం! నేను మీ PARUGU Founder. సినిమాలంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం. సినిమా తీసే విధానం, తెరవెనుక జరిగే ప్రతి విశేషం, ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను చాలా లోతుగా తెలుసుకున్నాను. సినిమాలపై ఉన్న ఆసక్తి, 14 సంవత్సరాల అనుభవం తో ఈ PARUGU వెబ్‌సైట్‌ను మొదలు పెట్టాను. నా సినీ ప్రయాణంలో తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలన్నీ ఇక్కడ మీతో పంచుకుంటాను.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*